కృష్ణానదిలో పడవ పల్టీ
ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి
వీరిలో ఇద్దరు బాలికలు
ప్రాణాలతో బయటపడ్డ మరో ఆరుగురు
పల్నాడు జిల్లాలో ఘటన
ఇసుకాసురుల అక్రమాలే కారణమంటున్న స్థానికులు
అచ్చంపేట/సాక్షి, అమరావతి: కృష్ణానదిపై పడవలో సరదాగా తిరిగేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని కోనూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులుకాగా వీరిలో ఇద్దరు బాలికలు. ఈ దుర్ఘటన నుంచి ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం కోనూరుకు చెందిన గంధం గంగయ్య వ్యవసాయం చేస్తుంటారు. వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న గంగయ్య రక్తసంబందీకులు, బంధువులు ప్రార్థనల కోసం శనివారం రాత్రి ఆయన ఇంటికి వచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం భోజనాల అనంతరం వీరిలో 14 మంది సమీపంలోని కృష్ణానది విహారానికి వెళ్లారు. వీరిలో పది మంది చేపలు పట్టే చిన్న పడవెక్కి కృష్ణానదిలో సరదాగా తిరిగేందుకు వెళ్లారు. నదిలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత పడవ అటు ఇటు ఊగడం ప్రారంభమైంది. చూస్తుండగానే పడవ బోల్తా కొట్టింది. వీరిలో ఈత వచ్చిన వేముల ముత్యాలు కూడా ఉండటంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగాడు. అంతలోనే నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి పడవల్లో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి నలుగురి మృతదేహాలు నదిలో లభ్యమయ్యాయి. పడవలో మృతదేహాలను ఒడ్డుకు తీసుకు రాగలిగారు.
మృతుల్లో పిడుగురాళ్లలో ఉంటున్న గంగయ్య కుమారుడు సత్యానందం రాజ్యలక్ష్మి కుమార్తెలు గంధం సంధ్య (11), గంధం షైని (9), మర్రిచెట్టువారిపాలెంలో నివసిస్తున్న గంగయ్య దగ్గరి బంధువు లక్ష్మణరావు, పూర్ణకుమారి కుమారుడు బత్తుల కార్తిక్ (14), చిలకలకూరిపేటలో ఉంటున్న గంగయ్య కుమార్తె అరుణ, శ్రీనివాసరావు కుమారుడు కొణతల చైతన్య (20) ఉన్నారు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.

ఇసుక గుంతలే కారణం!
స్థానికుల కథనం ప్రకారం, గత ఏడాది కృష్ణానదిలో ఇసుక తవ్వకాల కోసం ఇష్టారీతిన తీసిన లోతైన గోతులు ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలు ప్రమాదకరంగా మారాయని, నలుగురి మరణానికి కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
కోనూరు వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. పడవ బోల్తా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆరి్థక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.


