టీచర్ల ‘టెట్‌’పై న్యాయ పోరాటం | Former CM YS Jagan mohan Reddy reacts on teachers issues | Sakshi
Sakshi News home page

టీచర్ల ‘టెట్‌’పై న్యాయ పోరాటం

Jun 24 2026 4:47 AM | Updated on Jun 24 2026 8:47 AM

Former CM YS Jagan mohan Reddy reacts on teachers issues

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వెల్లడి 

చట్ట సవరణకు పార్లమెంటులో ఎంపీలు పోరాడతారు  

టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ 

వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్య వివరించిన వైఎస్సార్‌టీఏ నాయకులు  

వివిధ సమస్యలతో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన జనం  

బాధితులందరికీ ధైర్యం చెబుతూ భరోసా ఇచ్చిన జననేత

సాక్షి, కడప: రెండు మూడు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయు­లు­గా నియామకమై ఉద్యోగం చేస్తున్న వారందరూ తప్పనిసరి­గా టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ఉత్తీర్ణత కావాల్సిందే అనే విషయమై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై మంగళవారం వైఎస్సార్‌ టీచర్స్‌ ఆసో­సియేషన్‌ నాయకులు పులివెందులలోని క్యాంపు కార్యాల­యంలో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్న వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్యను వివరించారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రస్తుతం తప్పనిసరి అంటున్న టెట్‌ పరీక్ష అభద్రతా భావానికి గురి చేస్తోందన్నారు. 

డీఎస్సీ పరీక్ష రాసి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు సైతం టెట్‌ పాస్‌ కావాలన్న నిర్ణయంపై తమ వినతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభు­త్వం అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వం చట్ట సవ­రణ చేయాలని ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయక పోవడం గురించి వివరించారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. పార్టీ తరఫున కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి న్యాయ పోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటులో ప్రశ్నిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణకు కృషి చేస్తామన్నారు. 

పులివెందుల క్యాంప్‌ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి     

 తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఉపాధ్యాయ సంఘం నేతలు 

రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆందో­ళనకు గురికావాల్సిన అవసరం లేదని, టీచర్ల తరఫున పోరా­టం చేస్తామని చెప్పారు. జగన్‌ భరోసాపై వైఎస్సార్‌ టీచ­ర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమరనాథరెడ్డి, స్టేట్‌ ఆసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సి.కె.వెంకటనాథరెడ్డి, నాయకు­లు జి.సురేష్‌రెడ్డి, బి.వీరా­రెడ్డి, వెంకటరెడ్డి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, వైఎస్‌ జగన్‌ను కడప ఎంపీ వైఎస్‌ అవి­నాష్‌ రెడ్డి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి.. వివిధ విషయాలపై చర్చించారు.  

ప్రజలతో మమేకం
వైఎస్‌ జగన్‌ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేక­మ­య్యారు. భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్ర­జాద­ర్బార్‌ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు, బాదితుల సమస్యలు విన్నారు. వారి నుంచి వినతులు స్వీక­రించా­రు. క్యాంపు కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివ­చ్చిన కార్య­కర్తలు, నాయకులు, మహిళలు, యువత, వృద్ధు­లు, దివ్యాంగులు, అభిమానులను ఆప్యాయంగా పలకరించా­రు. టీడీపీ ­నే­తల వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల సమస్యలను విని వారికి ధైర్యం చెప్పారు. 

ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, తాను అండగా నిలుస్తానని భరో­సా కల్పించారు. సమస్యల పరిష్కారా­నికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ పులివెందులకు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వైఎస్‌ జగన్‌ను  చూడగానే అభిమానులు, పార్టీ శ్రేణులు జై జగన్‌ నినాదాలతో హోరె­త్తించారు. కాగా, భాక­రా­పురంలోని క్యాంపు కార్యాల­యా­నికి వెళ్తూ.. మార్గం మధ్యలో ఆయే­షా అనే మహిళను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. 

బ్రెయిన్‌ టీబీతో బాధ పడు­తున్న ఆయేషాకు మూడేళ్ల క్రితం వైద్య సహాయం అందించిన వైఎస్‌ జగన్‌.. ప్రస్తుతం ఆమె మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారని తెలుసుకుని పరామర్శించారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ దయ వల్లే గతంలో మెరుగైన వైద్యం అందిందని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement