
వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజీ వద్ద పరవళ్లు
5.59 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
శ్రీశైలం, సాగర్, పులిచింతలలోకి కొనసాగుతున్న వరద
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/తాడేపల్లిరూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్ : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు మూసీ, మున్నేరు, కట్టలేరు, బుడమేరు, కొండవీటివాగు ప్రవాహం తోడవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5,59,185 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5,59,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఎగువన వర్షాలు కురస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద కొనసాగుతోంది. ఆ రెండు జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఉప నది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ కూడా నిండింది. దాంతో కృష్ణా, భీమా వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యాం కూడా నిండిపోయి సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది.
దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,72,234 క్యూసెక్కులు చేరుతుండగా.. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,06,608 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,982 క్యూసెక్కులు.. వెరసి 1,72,590 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,72,774 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిలే వే గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 2,36,958 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
దీనికి మూసీ వరద తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 2,73,900 క్యూసెక్కుల వరద చేరుతోంది. స్పిల్ వే గేట్ల ద్వారా 1,84,692 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కృష్ణాలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.