కోవిడ్‌ ఆస్పత్రికి చేరువలో ఫైరింజన్‌

Fire Engine At Near To Covid Hospital - Sakshi

ప్రమాదం జరిగితే ఐదు నిమిషాల్లో చేరుకునేలా ఏర్పాటు 

ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది రమేష్‌ ఆస్పత్రితో పాటు ఈ ఏడాది గుజరాత్, మహారాష్ట్రల్లో అగ్ని ప్రమాదాలకు కారణాలను అన్వేషించి అటువంటివి ఇక్కడ పునరావృతం కాకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న మొత్తం 550 ఆస్పత్రుల్లో రోజూ విధిగా తనిఖీలు నిర్వహించి వాట్సప్‌ ద్వారా నివేదికలు తీసుకుంటున్నట్టు ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న 80 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అగ్ని నిరోధక యంత్ర పరికరాలను అందించారు. ఐదు నిమిషాల్లో చేరుకునేలా ప్రతి కోవిడ్‌ ఆస్పత్రికి కిలోమీటర్‌ దూరంలో అగ్నిమాపక శకటాలను ఉంచుతున్నారు. కోవిడ్‌ చికిత్స అందిస్తున్న అన్ని ఆస్పత్రులు, అగ్నిమాపక కేంద్రాలతో కలిపి ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి రోజూ పర్యవేక్షిస్తున్నారు.

అగ్ని ప్రమాదాలకు కారణాలివే..
► ఐసీయూల్లో వైద్య సిబ్బంది శానిటైజర్‌ వాడుతుండటం
► ఐసీయూల్లో ఒక ప్లగ్‌ పాయింట్‌ నుంచే అనేక వైద్య పరికరాలను వినియోగించడం
► ఐసీయూల్లో బెడ్లు, కర్టెన్ల దగ్గర్నుంచి పీపీఈ కిట్ల వరకూ అన్ని అగ్నిని వేగంగా వ్యాప్తి చెందించేవి కావడం
► ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ను క్రమం తప్పకుండా పరీక్షించకపోవడం
► అధిక శాతం అగ్ని ప్రమాదాలు రాత్రి పూటే జరుగుతుండటంతో ఆ సమయంలో ఎలక్ట్రీషియన్లు పర్యవేక్షించేలా చూడటం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top