
కృష్ణా జిల్లా కొత్తమాజేరు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులుదీరిన రైతులు
యూరియా కోసం క్యూ కడుతున్న రైతులు
ఏలూరు జిల్లా గంగవరంలో వరిచేనులో నిరసన
కృష్ణాజిల్లా కొత్తమాజేరులో సొమ్మసిల్లిన అన్నదాత
బాపట్ల జిల్లా బలుసులపాలెంలో టీడీపీ నేత దుకాణానికి యూరియా
చల్లపల్లి/కొయ్యలగూడెం/చెరుకుపల్లి: యూరియా కొరత రైతులను వెన్నాడుతూనే ఉంది. డిమాండ్‌కు సరిపడా అందడం లేదు. ఫలితంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద అన్నదాతలు క్యూ కడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా టీడీపీ తీరు మారడం లేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు.
తమ దుకాణాలకు యూరియా నిల్వలను తరలించుకుపోతున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా కోసం వచ్చిన రైతు వేముల నాగేశ్వరరావు ఆదివారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సహకార సంఘానికి ఆదివారం ఉదయం యూరియా లోడు రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. అయితే జిల్లా ట్రైనీ కలెక్టర్ పర్హీన్ జాహిద్ వస్తున్నారని అధికారులు యూరియా పంపిణీ ప్రారంభించలేదు.
ఉదయం ఏడుగంటలకే బారులు తీరిన రైతులు దాదాపు రెండుగంటలపాటు వేచిచూశారు. ఈ సమయంలో నాగేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు సపర్యలు చేశారు. నాగేశ్వరరావు ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ తీరు వల్ల యూరియా దొరక్క అల్లాడుతున్నారు. ఎట్టకేలకు 10.30 గంటలకు యూరియా పంపిణీ చేపట్టినా ఓటీపీ చెప్పాలని అధికారులు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫోన్లు తెచ్చుకోలేదని, ఓటీపీ అడగడమేమిటని కన్నెర్ర చేశారు. దీంతో అధికారులు ఓటీపీ లేకుండానే యూరియా పంపిణీ చేపట్టారు.
– యూరియా కొరతపై ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరిచేలో నిలబడి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో గవరవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు పలివెల దుర్గారావు, గ్రామ రైతు అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రైతులు నరాల రామారావు, వేమ నాయుడు, యాకోబు మోషే, శ్రీను, చిన్న తాతారావు, మహేష్, కోనాల దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేత దుకాణానికి దర్జాగా తరలింపు
07ఆర్‌పిఎల్77–ట్రాక్టర్‌లో యూరియా తరలించుకుపోతున్న టీడీపీ నాయకులు ఓవైపు యూరియా అందక పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు యూరియా నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామంలో ఆదివారం రైతులు చూస్తుండగానే ఓ టీడీపీ నాయకుడు ట్రాక్టర్‌లో 50 యూరియా బస్తాలు తన దుకాణానికి తరలించుకున్నాడు.
బలుసులపాలెం రైతు సేవా కేంద్రం వద్ద శనివారం యూరియా పంపిణీ జరిగింది. అయితే రైతులకు ఒక్కొక్కరికి ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇచ్చిన అధికారులు ఆదివారం రైతులంతా చూస్తుండగానే అదే గ్రామంలోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడికి మాత్రం ఏకంగా 50 బస్తాలు ఇచ్చారు.
అతను ట్రాక్టర్‌లో వాటిని తన దుకాణానికి తరలించాడు. రూ.270 ధర ఉన్న యూరియా బస్తాను ఏకంగా అతను రూ.450కి విక్రయిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏవో ఫరూక్‌ను వివరణ కోరగా తనకు ఆరోగ్యం సరిగా లేనందున రాలేదని, యూరియా పంపిణీ విషయం తెలియదని చెప్పారు.