
అన్నదాతల్లో వెల్లువెత్తిన ఆక్రోశం
అనకాపల్లి జిల్లా రాజాంలో కర్షకుల మధ్య తోపులాట
మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో తిరగబడిన రైతులు
టీడీపీ కార్యకర్తను చితకబాదిన వైనం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు.
వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు.
ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు.
» అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.
» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
» విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
» కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు.
» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు.
» యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు.

ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.