ఎగుమతుల్లో ఏపీ పైపైకి.. | Sakshi
Sakshi News home page

ఎగుమతుల్లో ఏపీ పైపైకి..

Published Thu, Sep 21 2023 4:39 AM

Exports above domestic average - Sakshi

సాక్షి, అమరావతి:  2017–18 నుంచి 2022–23 మధ్య దేశ ఎగుమతులు సగటున 8.2 శాతం వృధ్ధి చెందగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 8.9 శాతం వృద్ధితో రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయని ఎగ్జిమ్‌ బ్యాంక్‌ అధ్యయన నివేదికలో పేర్కొంది. రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు దృష్టి పెట్టని మార్కెట్లను కూడా అందిపుచ్చుకోగలిగితే ఎగుమతులు మరింత వేగంగా విస్తరిస్తాయని తెలిపింది.

అవకాశం ఉన్నా, ఇప్పటివరకు అందిపుచ్చుకోని మార్కెట్‌ విలువ రూ. 88,800 కోట్లు వరకు ఉందని అంచనా వేసింది. ఈ మార్కె­ట్‌ పైనా దృష్టి పెడితే రాష్ట్ర ఎగుమతుల విలువ రూ. 2.43 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఎగ్జిమ్‌ బ్యాంక్‌ మధ్యంతర అంచనాల ప్రకారం 2027–28 నాటికి రాష్ట్ర ఎగుమతులు రూ. 4.80 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇందులో వాణిజ్య ఉత్పత్తుల విలువ రూ. 4 లక్షల కోట్లుగా, సేవల రంగం వాటా రూ. 80 వేల కోట్లు ఉండనుంది. 

ప్రభుత్వంతో కలిసి ప్రోత్సాహక చర్యలు 
రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఎండీ హర్ష బంగారి ‘సాక్షి’ కి తెలిపారు. ఇందుకోసం ఎగుమతిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు జిల్లాలవారీగా అవకాశాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇంతవరకు అవకాశాలు అందిపుచ్చుకోని రంగాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు.

ఇందులో భాగంగా అధిక విలువ ఉన్న రిఫైన్డ్‌ షుగర్‌ను బంగ్లాదేశ్‌కు, పేపర్‌ వోచర్‌ కార్డులను ఇథియోపియాకు ఎగుమతి చేసేలా ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రెండు కంపెనీలను ప్రోత్సహించిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆరు ప్రధాన ఎగుమతి జిల్లాలైన తూర్పు, పశి్చమ గోదావరి, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు  జిల్లాలను ఎంపిక చేసి అక్కడి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.  

Advertisement
Advertisement