
ఎస్సీఈఆర్టీ చర్యలతో గాడితప్పిన పరీక్ష విధానం
ఎఫ్‌ఏ–1తో తెల్లబోయిన టీచర్లు
కొత్తవిధానంపై అవగాహనకల్పించకుండా అమలు
అక్షరాలు నేర్చుకునే విద్యార్థులు పదాలు రాయాలనడంపై విస్మయం
‘ఏ మేధావులు తయారుచేశారో ఈ ఒకటో తరగతి పరీక్ష పేపర్లు! పేరాగ్రాఫ్ విని ఇంగ్లిష్ లో ఆన్సర్ చేయాలంట. వర్డ్స్ రాయాలంట. పదాలు తయారు చేయాలంట. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలతో ఏం ఉపయోగం? పాఠశాలలో ప్రయోగశాల ఉండాలి తప్ప, పాఠశాలనే ప్రయోగశాలగా మార్చడం పద్ధతి కాదు..’ ఎఫ్‌ఏ–1 ఒకటో తరగతి ఇంగ్లిష్ పేపర్ తీరుపై ఉపాధ్యాయుల అభిప్రాయం ఇది.
నాలుగు, ఐదో తరగతి పరిసరాల విజ్ఞానం 8 పేజీల ప్రశ్నపత్రంలో ప్రశ్నలను ‘నాట్ కండిషన్’తో అడిగారు. డీఎస్సీ పరీక్షకి తయారుచేసిన ప్రశ్నల్లో మిగిలిన వాటిని ఏమైనా ఈ పేపర్లో ఇచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ప్రశ్నలు? ఇవి విద్యార్థి సామర్థ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సరిగ్గా అంచనా వేయలేవు..’ మంగళవారం జరిగిన ఈ పరీక్షపై కొందరు సీనియర్ ఉపాధ్యాయుల అభిప్రాయం.
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరం అమల్లోకి తెచ్చిన పరీక్ష విధానం ఫెయిలైంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పెట్టిన మొదటి పరీక్ష ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–1 ఉపాధ్యాయులకే అర్థంగానిరీతిలో ఉందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు అసెస్‌మెంట్ పుస్తకాలిచ్చి, అన్ని పరీక్షలను వాటిలోనే రాయాలన్న నిబంధన పెట్టారు. పరీక్ష విధానంలో పలు మార్పులు తీసుకొచి్చన రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణమండలి (ఎస్సీఈఆర్టీ) ఈ పరీక్షలపై అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేదని చెబుతున్నారు.
విద్యార్థులు ఒకమార్కు ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్లపై జవాబులు బబ్లింగ్ చేయడం, మరోపక్క వ్యాసరూప ప్రశ్నలకు పుస్తకంలో జవాబులు రాయడం ఒక ఎత్తయితే, పేపర్ల వాల్యూయేషన్ ఉపాధ్యాయులకు కొత్త పరీక్ష పెట్టింది. మొత్తం వాల్యూయేషన్ ప్రక్రియను రెండు, మూడురోజుల్లో పూర్తిచేసి ఓఎంఆర్ షీట్లను లీప్ యాప్‌లో స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాల్సి రావడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రాథమిక స్థాయిలోనే కఠిన పరీక్ష
సాధారణంగా ఒకటో తరగతిలోనే అత్యధికమంది విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నేర్చుకునేది చాలా స్వల్పం. కానీ ఒకటో తరతి ఎఫ్‌ఏ–1 ఇంగ్లిష్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూసి ఉపాధ్యాయులే విస్తుపోయారు. ఇందులో 8, 9, 10 ప్రశ్నలకు ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ విని జవాబులు రాయాలన్నారు. అలాగే ఇంగ్లిష్ పదం ఇచ్చి దానికి సరిపోయే బొమ్మను కనుక్కునేలా ప్రశ్నలు అడిగారు. రెండో తరగతి ఇంగ్లిష్ మొదటిప్రశ్న ఆంగ్లంలోని అచ్చులకు వ్యాకరణం పరీక్షిస్తూ అడిగారు.
పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు కాకముందే అత్యంత లోతైన సామర్థ్యాలను పరీక్షించేలా ఎస్సీఈఆర్టీ నిపుణులు ప్రశ్నపత్రాలు తయారు చేయడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 35 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో సగం ప్రశ్నలు విషయపరిజ్ఞాన (అనలైటికల్) ప్రశ్నలే కావడంతో ఎలా రాయాలో తెలియక విద్యార్థులు తికమకపడినట్టు తెలిసింది. మరోపక్క ఒకమార్కు జవాబులను ఓఆర్‌ఎం షీట్లపై బబ్లింగ్ చేయడం చేతగాక ప్రాథమికస్థాయి విద్యార్థులు పరీక్ష రాయలేకపోయినట్టు సమాచారం. చాలా ప్రశ్నలు సిలబస్ నుంచిగాక పూర్తిగాని పాఠ్యాంశాల నుంచి ఇచ్చారని తెలిసింది.
ఉపాధ్యాయులకూ కఠిన పరీక్షే..
విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను అసెస్‌మెంట్ పుస్తకంలో రాయాలి. మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్ చేయాలి. అసెస్‌మెంట్ బుక్‌లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు నివేదిక రాయాలి. విద్యార్థుల జవాబుపత్రాల ఓఎంఆర్ షీట్లను స్కాన్‌చేసి లీప్‌యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు చొప్పున స్కాన్ చేయాలి. ఇప్పటికే రోజూ యాప్‌లు, ఆన్‌లైన్ వర్క్, అర్జెంట్ ఫైళ్లతో బోధనకు దూరమైన తమకు ఇది మరో భారమైందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ప్రైవేటులో సొంతంగా పేపర్లు!
ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఈనెల 11 నుంచి 14 వరకు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేశారు. ఫార్మెటివ్ పరీక్షలను ఎవరికివారు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించడంతో ప్రైవేటు యాజమాన్య స్కూళ్లు ఈనెల 11వ తేదీకి ముందే నిర్వహించాయి. ఇప్పటికే తలాతోకా లేని విధానాలకు సంస్కరణల పేరు పెట్టిన కూటమి ప్రభుత్వం సర్కారు బడులను, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ తరహా పరీక్షల్లోను విద్యార్థులు ఫెయిలైతే.. ప్రభుత్వ స్కూళ్లకంటే ప్రైవేటు స్కూళ్లే మేలు అని తల్లిదండ్రులు భావించి పిల్లల్ని మార్చే అవకాశాలున్నాయి. కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలుచేసేందుకే ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.