వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య సంతానానికీ సమాన హక్కు | Equal rights to children of second wife in hereditary property | Sakshi
Sakshi News home page

వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య సంతానానికీ సమాన హక్కు

Jun 28 2026 5:44 AM | Updated on Jun 28 2026 5:44 AM

Equal rights to children of second wife in hereditary property

రెండో వివాహం సంతానం చట్టబద్ధమైనదే 

మొదటి భార్య కుమారుని రెండో అప్పీల్‌ కొట్టేసిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: తండ్రికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో అతడి మొదటి భార్య పిల్లలతో పాటు రెండో భార్య సంతానానికి కూడా సమాన హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్య మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నానని, తద్వారా కుమార్తెలు జన్మించారని తండ్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో ఆ కుమార్తెలు చట్ట­బద్ధ సంతానమే అవుతారని స్పష్టంచేసింది. సదరు తండ్రి వంశపారంపర్య ఆస్తికి కుమార్తెలు సైతం హక్కుదారులేనని, వారందరికీ ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన దాఖలైన రెండవ అప్పీల్‌ను కొట్టేసిన న్యాయ­మూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించారు. 

తండ్రి, కుమార్తెల న్యాయ పోరాటం 
తురంగి సోమరాజుకు కాకినాడ గ్రామీణ మండలం, గైగోలుపాడు గ్రామంలో వంశపారంపర్య ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో తనకూ, రెండో భార్యతో తనకు కలిగిన ఆరుగురు కుమార్తెలకు  సమాన వాటా ఉందని, దీనిపై తన మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ విబేధిస్తున్నాడని, ఆస్తుల పంపకాలు జరగనీయడం లేదని పేర్కొంటూ సోమరాజు ఆయన కుమార్తెలతోపాటు కాకినాడ ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ దావాను కొట్టేసింది. దీనిపై సోమ­రాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అద­నపు జిల్లా కోర్టులో మొదటి అప్పీల్‌ దాఖలు చేశారు. 

ఈ అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే సోమరాజు మరణించారు. అయితే దావాపై విచారణ జరిపిన కోర్టు.. సోమరాజు, ఆయన కుమారుడు సత్యనారాయణతో పాటు ఆరుగురు కుమార్తెలకు ఆ ఆస్తిలో సమాన వాటా (8 వాటాలు) ఉందంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవా­లు చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీల్‌ దాఖలు చేశారు. తన తండ్రికి రెండో వివాహం కాలేదని, ఆయన కుమార్తెలు చెబుతున్నట్లు వారు తన తండ్రికి జన్మించలేదని సత్యనారాయణ చేసిన వాదనలను హైకోర్టు త్రోసిపుచ్చింది. 

తన తండ్రి తన నుంచి రూ. 80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులు వదులుకున్నారన్న వాదనలనూ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోమరాజు మరణించినందు­న, ఆయన వాటాకు రెండో భార్య హక్కుదారు అవుతారని కూడా హైకోర్టు  స్పష్టం చేసింది.  ఇక రూ.80 వేలు తీసుకుని తండ్రి ఆస్తిపై వాటా వదులుకున్నారని  సత్యనారాయణ మౌఖికంగా చెబుతున్నారే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలను చూపడం లేదన్నారు. ఒకవేళ డబ్బు తీసుకుని సోమ­రాజు ఆస్తిపై హక్కు వదులుకున్నది నిజమే అనుకున్నా,  ఆయన తన వాటా ఆస్తిపై హక్కును వదులుకోగలరే తప్ప, కుమార్తెలకు రావాల్సిన వాటా విషయంలో కాదని న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలకృష్ణారావు స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement