breaking news
Somaraju
-
వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య సంతానానికీ సమాన హక్కు
సాక్షి, అమరావతి: తండ్రికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో అతడి మొదటి భార్య పిల్లలతో పాటు రెండో భార్య సంతానానికి కూడా సమాన హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్య మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నానని, తద్వారా కుమార్తెలు జన్మించారని తండ్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో ఆ కుమార్తెలు చట్టబద్ధ సంతానమే అవుతారని స్పష్టంచేసింది. సదరు తండ్రి వంశపారంపర్య ఆస్తికి కుమార్తెలు సైతం హక్కుదారులేనని, వారందరికీ ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన దాఖలైన రెండవ అప్పీల్‌ను కొట్టేసిన న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించారు. తండ్రి, కుమార్తెల న్యాయ పోరాటం తురంగి సోమరాజుకు కాకినాడ గ్రామీణ మండలం, గైగోలుపాడు గ్రామంలో వంశపారంపర్య ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో తనకూ, రెండో భార్యతో తనకు కలిగిన ఆరుగురు కుమార్తెలకు సమాన వాటా ఉందని, దీనిపై తన మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ విబేధిస్తున్నాడని, ఆస్తుల పంపకాలు జరగనీయడం లేదని పేర్కొంటూ సోమరాజు ఆయన కుమార్తెలతోపాటు కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ దావాను కొట్టేసింది. దీనిపై సోమరాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అదనపు జిల్లా కోర్టులో మొదటి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే సోమరాజు మరణించారు. అయితే దావాపై విచారణ జరిపిన కోర్టు.. సోమరాజు, ఆయన కుమారుడు సత్యనారాయణతో పాటు ఆరుగురు కుమార్తెలకు ఆ ఆస్తిలో సమాన వాటా (8 వాటాలు) ఉందంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీల్ దాఖలు చేశారు. తన తండ్రికి రెండో వివాహం కాలేదని, ఆయన కుమార్తెలు చెబుతున్నట్లు వారు తన తండ్రికి జన్మించలేదని సత్యనారాయణ చేసిన వాదనలను హైకోర్టు త్రోసిపుచ్చింది. తన తండ్రి తన నుంచి రూ. 80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులు వదులుకున్నారన్న వాదనలనూ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోమరాజు మరణించినందున, ఆయన వాటాకు రెండో భార్య హక్కుదారు అవుతారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ.80 వేలు తీసుకుని తండ్రి ఆస్తిపై వాటా వదులుకున్నారని సత్యనారాయణ మౌఖికంగా చెబుతున్నారే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలను చూపడం లేదన్నారు. ఒకవేళ డబ్బు తీసుకుని సోమరాజు ఆస్తిపై హక్కు వదులుకున్నది నిజమే అనుకున్నా, ఆయన తన వాటా ఆస్తిపై హక్కును వదులుకోగలరే తప్ప, కుమార్తెలకు రావాల్సిన వాటా విషయంలో కాదని న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు స్పష్టం చేశారు. -
సోమరాజుకు ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు
గొల్లపాలెం (కాజులూరు): స్థానిక గాయత్రి ఫొటో స్టూడియో అధినేత మేరేటి సోమరాజు అంతర్జాతీయ ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. ఆ వివరాలను ఆయన ఆదివారం గ్రామంలో విలేకరులకు తెలిపారు. ప్రతీ ఏటా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీæ(లండన్), ఫొటో సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీలా ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)లతోపాటు ఇమేజ్ కాలేజ్ సొసైటీ ఆఫ్ అమెరికా ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తాయన్నారు. ఈ ఏడాది ఆ పోటీలకు తాను గిరిజన జీవనశైలిపై తీసిన ఛాయాచిత్రాలను పంపగా తనకు అత్యున్నత పురస్కారం లభించిందన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్ కాలేజ్ సొసైటి చైర్మన్ టోని లికిస్ తాస్ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారన్నారు. తనను ఆ అవార్డుకు ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాలపు సభ్యత్వాన్ని కూడా ప్రకటించారన్నారు. తన అవార్డు పత్రాలను ఆ సంస్థలు విజయవాడలో ఉన్న ప్రతినిధులకు పంపించగా ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో శనివారం అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా తాను అందుకున్నానన్నారు. సోమరాజును మండల ఫొటోగ్రాఫర్స్ సంఘ సభ్యులు అభినందించారు. -
గోదావరిలో అయ్యప్పభక్తుడు గల్లంతు
మంగపేట: గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ అయ్యప్ప భక్తుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన సెగ్గం సోమరాజు(22) అయ్యప్ప మాల ధరించాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. స్నానం చేస్తూ నీట మునిగాడు. కొంతసేపటి తర్వాత గమనించిన తోటి వారు అతడి కోసం వెదికినా జడ దొరకలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈతగాళ్లను రప్పించి సోమరాజు కోసం గాలిస్తున్నారు. -
డెంగీపై సమరం
చిత్తూరు (సెంట్రల్) : రాష్ట్ర ప్రభుత్వం డెంగీపై సమరం ప్రకటించిందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ సోమరాజు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన, అదనపు కమిషనర్ జయ చంద్రారెడ్డి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డెంగీపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. 24 గ ంటలు, ఏడు రోజలు కింది స్థాయి ఆస్పత్ర నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రి వరకు ఎక్కెడికక్కడ ఫీవర్ సెల్లు ఏర్పాటు చేసి రోగుల వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. జ్వరం వచ్చిన ప్రతి రోగిని అన్ని పరీక్షలతో పూర్తిగా పరిశీలించి డెంగీపై నిర్ధారణకు వస్తున్నామన్నారు. కాయకల్ప పథకం కింద చిత్తూరు, మదనపల్లె ఆస్పత్రులు ఎంపికయ్యాయని చెప్పారు. ఈ పథకం కింద ఆస్పత్రులకు పారిశుధ్ధ్యం, నీటి వసతులు, బెడ్ షీట్ల శుభ్రత, వైద్యుల వైద్య పరిశీలన, రోగులు ,ఆస్పత్రి ఆవరణపై శ్రద్ద తదితర అన్ని విభాగాలపై పాయింట్లను సేకరిస్తామన్నారు. రెండు బృందాలు తనిఖీ చేసి ఈ పాయింట్లు సేకరిస్తాయని, వాటిని పరిశీలించి మొదటి స్థానం వచ్చిన ఆస్పత్రికి రూ.50లక్షల పారితోషికం అందిస్తామన్నారు. అలాగే ఈ ఆస్పత్రిని అపోలో ఆస్పత్రికి లీజుకిస్తారనే విషయంపై అపోహలొద్దని, 300 పడకలు కలిగిన ఆస్పత్రిని వారికి ఇవ్వడం వల్ల వారు అనేక డిపార్టుమెంట్లు పెట్టి ఇంకా అభివృద్ధి చేస్తారన్నారు. వారి సొంత నిధులు ఖర్చుపెట్టి రోగులకు మెరుగైన సేవలందించి తిరిగి ప్రభుత్వానికే అందిస్తారన్నారు. డీసీహెచ్ఎస్ సరళమ్మ, సూపరింటెండెంట్ జయరాజ్, ఆర్ఎంవో సంధ్య,డాక్టర్లు అరుణ్ కుమార్,దేవదాస్ పాల్టొన్నారు.


