ఇసుకపై పదేపదే వక్రీకరణలు | Sakshi
Sakshi News home page

ఇసుకపై పదేపదే వక్రీకరణలు

Published Sun, Sep 3 2023 4:37 AM

Eenadu Ramoji Rao Fake News On Sand Mining In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్‌ రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్‌గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు..

అక్రమ మైనింగ్‌ చేయాల్సిన అవసరం ఏంటి?
రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్‌ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్‌ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్‌ యార్డ్‌ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్‌ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి.

ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్‌ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్‌ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్‌ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్‌ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు.

గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు!
గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు.  మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది.

ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది.  స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను సీజ్‌ చేసింది.

ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి.  కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్‌ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది.

రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు
ఓపెన్‌ రీచ్‌లు, ఇసుక శాండ్‌ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్‌ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం.

కాంట్రాక్ట్‌ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్‌ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్‌ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక  తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు.

ఇసుక మాఫియాకు చెక్‌ పెట్టాం
ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్‌ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది.

అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్‌ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్‌టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్‌ వెంచర్స్‌ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్‌ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్‌ దక్కించుకున్నది జేపీ పవర్‌ వెంచర్స్‌ కంపెనీ ఒక్కటే.

అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్‌ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్‌ కాంట్రాక్టర్‌ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.

ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్‌ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది?

Advertisement
 
Advertisement
 
Advertisement