అవి అప్పులు కాదు.. డిస్కంలకు ఆస్తులే.! | Eenadu false news on power companies | Sakshi
Sakshi News home page

అవి అప్పులు కాదు.. డిస్కంలకు ఆస్తులే.!

Published Sun, Dec 3 2023 3:55 AM | Last Updated on Sun, Dec 3 2023 3:55 AM

Eenadu false news on power companies - Sakshi

సాక్షి, అమరావతి: ఎవరైనా స్థిరాస్తులు ఏర్పరుచుకునే సమయంలో రుణం తీసుకోవడం సహజం. అలాగే ఆస్తుల కల్పనకు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కూడా తీసుకుంటాయి. వాటితో విద్యుత్‌ సరఫరా సాఫీగా జరగడానికి సబ్‌ స్టేషన్లు, కార్యాలయ భవనాలు, స్థలాలు, విద్యుత్‌ లైన్లు వంటి స్థిరాస్తులు ఏర్పరుచుకుంటాయి. ఆ తర్వాత బిల్లుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించి అప్పులు తీరుస్తాయి.

అలాగే విద్యుత్‌ కొనుగోలు కోసం బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు చెల్లిస్తుంటాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు ఆదా అవుతుంటే.. ఏమాత్రం అవగాహన లేకుండా ‘కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప’ శీర్షికన ఈనాడు మంగళవారం ఓ కట్టుకథను అచ్చేసింది. దీనిపై నిజాలను ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వివరించారు. 

పెట్టుబడిలో 40 శాతం రాయితీ
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో భాగంగా వినియోగదారులకు స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్‌ మీటర్లు బిగించాలని ప్రతిపాదించడం జరిగింది. ఇది కేవలం 25 శాతం మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

దీనివల్ల సమయానుసార (టైం అఫ్‌ డే) టారిఫ్‌ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్‌ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్‌ పీక్‌ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్‌ లాభం పొందే అవకాశం ఉంది. విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అధిక విద్యుత్‌ వాడే వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు తప్పనిసరి. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. ఈ ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఒక భాగం మాత్రమే.  

వడ్డీ మిగులు
ఈ సంవత్సరం పెరిగిన రుణాలలో ఎక్కువ భాగం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల బకాయిలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆలస్య చెల్లింపుల సర్‌ చార్జీ నిబంధనల ప్రకారం పంపిణీ సంస్థలు చెల్లించాయి.  బ్యాంకుల వద్ద కన్నా తక్కువ వడ్డీకి, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలలో ఉన్న ఆలస్య చెల్లింపు సర్‌ చార్జీకన్నా చాలా తక్కువ వడ్డీ రేటుకు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించి ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాయి. దీనివల్ల వడ్డీ మిగులు రూపంలో రూ. వందల కోట్లు మిగిల్చాయి. వాస్తవాలు ఇలా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు వక్రరాతలు రాయడం విడ్డూరంగా ఉంది.  

రుణాల ద్వారా ఆస్తుల సృష్టి
అభివృద్ధి పనులు, వ్యవస్థ బలోపేతం కోసం చేసే పనుల ప్రాజెక్టుల వ్యయంలో దాదాపు 80 శాతం నుంచి ఒక్కోసారి 100 శాతం వరకూ ఆర్థిక సంస్థల నుంచి విద్యుత్‌రంగ సంస్థలు రుణాలు తీసుకుంటాయి. కొత్త ఆస్తుల సృష్టి రుణాల ద్వారానే సాధ్యమవుతుంది. వాటి ద్వారా వచ్చే రాబడితో అప్పులు కూడా తీరతాయి.

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కూడా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు బహుళ వార్షిక విద్యుత్‌ టారిఫ్‌ నిబంధనలు నిర్దేశిస్తుంది. డిస్కంలు ఏటా అవసరాలకు అనుగుణంగా సబ్‌ స్టేషన్లు, లైన్లు నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపడతాయి. వీటికి కావలసిన ఆర్థిక అవసరాలలో ఎక్కువ భాగం రుణాల ద్వారా సేకరిస్తాయి. ఖర్చులను నిబంధనల ప్రకారం టారిఫ్‌ నుంచి రాబట్టుకోవడానికి కమిషన్‌ అనుమతి తీసుకుంటాయి.

రైతుకు డిమాండ్‌ చేసే హక్కు
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 18 శాతం నుంచి 20 శాతం అవుతోంది. కచ్చితత్వంతో ఈ విద్యుత్‌ను లెక్కించలేకపోవడం వల్ల రాష్ట్రంలో ఇంధన ఆడిట్‌ కష్టం అవుతోంది. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనల ప్రకారం వ్యవసాయ వినియోగదారులకు కూడా మీటర్లు బిగించాలి.

వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా అయ్యే కరెంట్‌ వినియోగం తెలుసుకోవడానికి, ఉచిత విద్యుత్‌ లబ్ధిదారులకు నగదు బదిలీ లెక్కకు వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్‌ మీటర్లు ఉపయోగపడతాయి. దీనికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతీ నెల వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారుడు కూడా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా కోసం డిస్కంలను డిమాండ్‌ చేసే హక్కు లభిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement