కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా? | Education Minister Lokesh must resign immediately says ys jagan | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?

Aug 21 2026 5:43 AM | Updated on Aug 21 2026 5:47 AM

Education Minister Lokesh must resign immediately says ys jagan

విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తక్షణం రాజీనామా చేయాల్సిందే : వైఎస్‌ జగన్‌

తప్పు ఒప్పుకుంటారు గానీ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? 

పరీక్షా పత్రం రూపొందించేది, పరీక్ష నిర్వహించేది ఒక్కరేనా? 

ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు 

స్పోర్ట్స్‌ కోటాలో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ఉద్యోగాలెలా ఇచ్చారు? 

పరీక్ష పెట్టనవసరం లేదంటూ.. పైగా పీవీ సింధుతో ఎలా పోలుస్తారు? 

ఆర్చరీలో బంగారు పతకం సాధించిన ఎస్టీ అభ్యర్థి దుర్గయ్యకు కాల్‌ లెటర్‌ పంపి ఉద్యోగం ఎందుకివ్వలేదు? 

డీఎస్సీలో జాబ్‌ ఇప్పిస్తామని తమను మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ల వ్యవహార శైలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. మరి అదే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి వేరే నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ 2025 కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌–1ల నియామకాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అసెంబ్లీలో మాట్లాడిన మాటల వీడియోలను చూపుతూ.. వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. మెగా డీఎస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై తాము ఇప్పటివరకూ ఏ అంశాలనైతే ప్రజలముందు ఉంచామో అవన్నీ వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

ఇవన్నీ గట్టిగా ప్రస్తావిస్తామనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని చెప్పారు. సభలో ఉన్న ఏకైక  ప్రతిపక్షం తమదని, ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తిస్తే,  సభా నాయకుడు సీఎంతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గుర్తించడం లేదన్నారు. గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టు లేనిచోట.. బౌలింగ్, ఫీల్డింగ్‌ లేకుండా తండ్రీ కుమారులు ఇద్దరూ బ్యాటింగ్‌ చేస్తూ, తాము అద్భుతంగా చేశామని తమకు తాము కితాబు ఇచ్చుకుంటున్నారంటూ వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ పేపర్‌ లీకేజీ, అక్రమాలపై చర్చ చేపట్టాలంటూ నాలుగు రోజులపాటు శాసన మండలిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు స్తంభింపచేశారని తెలిపారు. 

అసెంబ్లీలో మాట్లాడతారేగానీ పక్కనే ఉన్న మండలిలో మాత్రం చర్చకు ముందుకు రావడం లేదన్నారు. ఎందుకంటే అక్కడ తమ పార్టీ బలం ఉంది కాబట్టి చర్చ జరిగితే వారి తప్పులన్నీ బయటకు వస్తాయని, డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తేటతెల్లం అవుతోంది కాబట్టి అక్కడ చర్చించడానికి ముందుకు రావడం లేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ స్కామ్‌ను అంశాలవారీగా ఎండగడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఒక్కరికే రెండు బాధ్యతలా..?
డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ అనేది ఒక అంశం. పరీక్ష నిర్వహణ అనేది మరో అంశం. ఈ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు అసెంబ్లీలో లోకేశ్‌ స్వయంగా అంగీకరించారు. పైగా తప్పేముంది? అని దబాయిస్తున్నారు. ప్రశ్న పత్రం తయారీ అనేది ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బాధ్యత. పరీక్షల నిర్వహణ డీఎస్సీ కన్వీనర్‌ బాధ్యత. ఈ రెండూ ఒక్కరి చేతే చేయిస్తే పారదర్శకత లోపిస్తుంది. లీకేజీకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను ఒకే వ్యక్తికి అప్పగించామని లోకేశ్‌ తనకు తానుగా ఒప్పుకున్నారు. పరీక్ష పత్రం తయారీ, నిర్వహణ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చెక్స్‌ అండ్‌ బ్యాలన్స్‌ అనేది తొలగిపోయింది. లీకేజీకి ద్వారాలు తెరి­చారు. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం.

ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?
డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు తొలి ర్యాంక్‌ వచ్చిందని తండ్రీ కుమారులు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌ పేరు ఉంది. రెండో లిస్ట్‌లో అతడి పేరు తీసేశారు. ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్‌ పేరు లేకుండా సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు విడుదల చేశారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చంద్రబాబు, లోకేశ్‌ చెబుతున్నారు. ఇదే వాస్తవం అయితే నవీన్‌ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? తన ఐడీని బ్లాక్‌ చేశారని, కాల్‌ లెటర్‌ తనకు పంపలేదని నవీన్‌ కోర్టుకు వెళ్లాడు. 

తన ఐడీ బ్లాక్‌ అయ్యిందని, కాల్‌ లెటర్‌ రాలేదని, డీఎస్సీలో మంచి మార్కులు వచ్చాయని, అయినా ఎందుకు కాల్‌ లెటర్‌ రాలేదని, ఇది నా జీవితానికి చివరి ఛాన్స్‌ అని విద్యాశాఖకు నవీన్‌ మెయిల్‌ పెట్టాడు. ఇదే విధంగా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. క్యాండిడేట్‌ ఐడీని బ్లాక్‌ చేసి కాల్‌ లెటర్‌ పంపనప్పుడు అతడు వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడు? దీనికి అసెంబ్లీలో అబ్బా కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కారణం.. నవీన్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్‌ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది కాబట్టి. అతడికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి. 

ముందస్తుగానే మెరిట్‌ లిస్ట్‌లో అతడి పేరు తొలగించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడీని బ్లాక్‌ చేశారు. కాల్‌ లెటర్‌ పంపలేదు. మొదటి లిస్ట్‌లో అతడి పేరు ఉంది, రెండో లిస్ట్‌లో తీసేశారు. ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్‌ దగ్గరే ఆగిపోయిందా? ఇంకా జరిగిందా? సీబీఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది.

పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?
ఒకవైపు సింధు పేరు చెప్పి వీళ్ల అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్చరీలో నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించిన ఎస్టీ అభ్యర్ధి దుర్గయ్యకు కాల్‌ లెటర్‌ పంపి ఉద్యోగం ఇవ్వలేదు. అతను ఆర్చరీలో బంగారు పతకం సాధించాడు. ఆశ్చర్యమేమిటో తెలుసా? వీళ్ల పార్టీకి చెందిన నేతలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న ‘‘సాఫ్ట్‌బాల్‌’’ అసోసియేషన్‌ నుంచి, అలాగే లోకేశ్‌ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్‌ అధ్యక్షుడిగా ఉన్న ‘‘జూడో అసోసియేషన్‌ నుంచి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్‌ కోటాలో ఏకంగా 372 పోస్టులు భర్తీ చేశారు. 

సాఫ్ట్‌బాల్‌ సంఘ అధ్యక్షునిగా ఉన్న కూన రవికుమార్, జూడో సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ భరత్‌ 

గతంలోనూ స్పోర్ట్స్‌ కోటా ఉండేది. కానీ డీఎస్సీ క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు లోకేశ్‌ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంటర్‌ కాలేజీ స్థాయిలో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి ఉద్యోగాలిచ్చారు. పని అయిపోయిన తరువాత ప్రభుత్వమే ఈ జీవోలను రద్దు చేసింది. ఇక మీదట క్వాలిఫై అయితేనే అర్హత అని మరలా పాత పద్ధతికే వచ్చారు. ఇలా ఎందుకు జీఓలు మార్చారు? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయికి స్కామ్‌ వెళ్లిందంటే పైనుంచి కింద వరకూ అందరూ ఉన్నట్టే కదా! మంత్రి సంతకం లేకుండా జీవో ఇస్తారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలా వద్దా?

బేరసారాలు జరిగినట్లు ఒప్పుకున్నా చర్యలేవీ?
స్పోర్ట్స్‌ కోటా పేరిట టీచర్‌ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోకుండా, ఎఫ్‌ఐఆర్‌లో ఆ వ్యక్తి పేరు రాయకుండా కేవలం ‘సస్పెక్ట్‌’ అని మాత్రమే రాశారు. పైగా అతడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణం.. సీనియర్‌ అధికారులతో మాట్లాడినట్లు రాశారు. మరి ఎవరితో మాట్లాడినట్లు? అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని, బెయిల్‌పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అసెంబ్లీలో తండ్రీ కుమారులు చెప్పినట్లు నిజంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా?  జైలుకు పంపారా? 

ఆ అరెస్ట్‌ ఉత్తదేనన్న సీసీటీఎన్‌ఎస్‌..
కేంద్రం ఆధ్వర్యంలోని ‘క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌’ (సీసీటీఎన్‌ఎస్‌)లో చూస్తే.. ఆ వ్యక్తిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఉంది. ఆ విషయం డాక్యుమెంట్‌లో ఉంది. నిజానికి ఆ వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు. కానీ, తండ్రీ కుమారులు ఇద్దరూ ఈ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరించినట్టు, అతడిని అరెస్టు చేసినట్లు, చర్యలు తీసుకున్నట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామా చేశారు. 

స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ కోసం రూ.14.10 లక్షలు లంచం
ఒంగోలులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. డీఎస్సీలో జాబ్‌ ఇప్పిస్తామని నమ్మించి తమను మోసం చేశారని ఓ మహిళా అభ్యర్థి రాధిక నుంచి ఫిర్యాదు వచ్చింది. స్పోర్ట్స్‌ కోటాలో జాబ్‌ కోసం రూ.14.10 లక్షలు లంచం ఇచ్చినట్లుగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు ఉన్నాయి. రిఫరెన్స్‌గా మరో వ్యక్తికీ ఇలా చేస్తున్నామని ఆమెకు చెప్పారు. రిఫరెన్స్‌గా చూపిన వ్యక్తికి వచ్చింది. కానీ ఈ అమ్మాయికి రాలేదు. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా నిలదీస్తే ఏపీ టూరిజంలో మరో పోస్టు ఇస్తామని మభ్యపెట్టారు. ఆ అమ్మా­యి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో డీఎస్సీ పోస్టు కోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరి­జ­ం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు. 

గతేడాది నవంబర్‌ 11న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేవు. అరెస్టులు లేవు. తన కంప్లైంట్‌పై ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదని ఆ అమ్మా­యి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా ఎక్కడికక్కడే వదిలేయాలని తండ్రీ కుమారులు ఇచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తున్నారు. డీఎస్సీ లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్‌ కోటా బేరసారాల వరకూ అన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేశ్‌ తక్షణం రాజీనామా చేయాలి.

పీవీ సింధూతో పోలికా..? పరీక్ష రాయకుండానే ఉద్యోగాలా?
డీఎస్సీ పరీక్ష  రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామూలుగా లేవు. స్పోర్ట్స్‌ పర్సన్స్‌కు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదంట! పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువుచెప్పే 372 టీచర్‌ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట! సింధూకి ఏ రూల్‌ పాటించారో ఇక్కడ కూడా అదే రూల్‌ పాటించారంట! 372 ఉద్యోగాలు పరీక్ష లేకుండా సింధూ పేరు చెప్పి తీసుకొచ్చారు. 

ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవ­డం ఆ అబ్బా కొడుకులు ఇద్దరికే మినహా ఎవరికైనా సాధ్యం అవుతుందా? పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? అసలు డీఎస్సీ ఎందుకు? పిల్లలకు చదువు చెప్పే సామర్ధ్యం ఉందో లేదో చూసేందుకే కదా? మరి బుద్ధి ఉన్న వాళ్లెవరైనా ఇలా చేస్తారా? అసలు పీవీ సింధుతో ఎలా పోలుస్తారు? పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం వచ్చాయి. 

ఒలింపిక్స్‌ నుంచి నేషనల్‌ గేమ్స్‌ వరకు ఏ మెడల్‌ సాధించిన వారికి ఎటువంటి పోస్టులు ఇవ్వాలనేది స్పష్టంగా వివరిస్తూ 2024 డిసెంబర్‌ 10న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 18 ఇదీ.. దీనిలోనే శాప్‌ కోచ్‌లకు ఇచ్చే పోస్టుల గురించి కూడా పేర్కొన్నారు 

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌ షిప్, కామన్వెల్త్, ఏసియన్‌ గేమ్స్‌ ఇలా చాలా ఇంటర్నేషనల్‌ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఇలాంటివాళ్లకి ప్రత్యేక పాలసీ ఉంది. ఆమేరకు కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుని వారికి మేలు చేస్తుంది. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్‌ వచ్చాయని అడుగుతున్నా. అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌తో ఎలా పోలు­స్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు.

సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్‌ రిక్రూట్‌మెంట్లో స్పోర్ట్స్‌ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెబుతున్న ఈ చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు. మరి తర్వాత వచ్చేవాళ్లు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏమిటంటే.. వాళ్ల మనుషులకు టీచర్‌ ఉద్యోగాలు అమ్ముకోడానికి ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారు.  పని పూర్తయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారు. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారు. అంటే మరలా గేట్లు మూసేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement