కౌన్సిల్‌కు ప్రదర్శనగా వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
డీఎస్సీ అక్రమాలపై మండలిలో చర్చ కోసం చివరి రోజూ పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
మండలి చైర్మన్ కుర్చీని చుట్టుముట్టి ఆందోళన
వాయిదా తీర్మానం తిరస్కరణ తర్వాత చర్చ కుదరదన్న చైర్మన్
సభ్యుల ఆందోళనల మధ్యే కొనసాగిన సభా కార్యక్రమాలు
ఆందోళనల నడుమ ప్రశ్నోత్తరాలు, స్వల్ప వ్యవధిలో 12 బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలంటూ నాలుగో రోజు గురువారం సైతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నల్లకండువాలు ధరించి శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభ వాయిదా విరామ సమయంలోనూ చైర్మన్ పోడియం ఎదుట నేలపై కూర్చుని ఆందోళన కొనసాగించారు. అయితే, డీఎస్సీ అంశంపై చర్చ లేకుండానే నాలుగు రోజుల శాసనమండలి సమావేశాలు ముగిశాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రమేష్‌యాదవ్, ఇషాక్‌బాషా డీఎస్సీ–2025 నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రకటించారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు ప్రకటించగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా చైర్మన్ పోడియం ముందుకు చేరుకుని డీఎస్సీ అక్రమాలపై వెంటనే చర్చను చేపట్టాలని కోరారు. అయితే, ప్రశ్నోత్తరాల కార్యక్రమమే కొనసాగుతుండడంతో పోడియం ముందు, పోడియంపైన చైర్మన్ కుర్చీని చుట్టిముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ఆందోళనకు దిగారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, డీఎస్సీపై సభలో చర్చ చేయకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది, వెంటనే చర్చకు అనుమతించాలి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
చైర్మన్ మోషేన్‌రాజు ఆందోళన చేస్తున్న సభ్యులను వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనను కొనసాగించారు. సభ్యుల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పోడియంపై చైర్మన్ కుర్చీకి రెండువైపులా నిలబడి నినాదాలు చేశారు. చైర్మన్ ముఖానికి అడ్డంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగిస్తుండటంతో 10.21 గంటల సమయంలో సభను తాత్కాలిక విరామ వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. సభ్యుల ఆందోళన కొనసాగిన ఆ 20 నిమిషాల సమయంలోనే మంత్రులు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఐదు ప్రశ్నలకు జవాబిచ్చారు.
నేలపై కూర్చుని ఆందోళన కొనసాగింపు
సభ విరామ వాయిదా పడిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం ముందు కూర్చుని ఆందోళన కొనసాగించారు. ‘చర్చకు రాకుండా విద్యాశాఖ మంత్రి పారిపోతున్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి. వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు ప్రభుత్వం’ అంటూ నినాదాలు కొనసాగించారు. 11.45 గంటల సమయంలో సభ తిరిగి ప్రారంభం కాగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు. అనంతరం బిల్లులపై చర్చను చేపడుతున్నట్టు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తిరిగి పోడియం వద్దకు చేరుకుని డీఎస్సీపై చర్చను చేపట్టాలంటూ ఆందోళనను కొనసాగించారు.
సభ్యులు పలు సందర్భాల్లో చైర్మన్‌కు దండం పెడూతూ డీఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతించాలని కోరడం గమనార్హం. కాగా, ఆందోళనల మధ్యనే దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే నాలుగు బిల్లులపై చర్చ కొనసాగి, ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు చైర్మన్ కుర్చీ చుట్టూ నిలబడి ప్లకార్డులతో ఆందోళన కొనసాగిస్తుండటంతో 12 గంటల సమయంలో సభను రెండోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అనంతరం 12.42 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళనల మధ్యనే మధ్యాహ్నం ఒంటిగంటలోపు మరో 8 బిల్లులపై చర్చ చేపట్టిన చైర్మన్ ఆ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
తర్వాత మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన ‘ది వాటర్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) అమెండ్‌మెంట్ యాక్ట్‌పై తీర్మానం ప్రవేశపెట్టి సభ్యుల ఆందోళన, గందరగోళ పరిస్థితుల మధ్య సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ‘షేమ్.. షేమ్. డీఎస్సీ చర్చనుంచి పారిపోయిన ప్రభుత్వం.. సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు కొనసాగించారు. అదే సభ నిరవధిక వాయిదాకు గుర్తుగా ‘జనగణమన..’ గీతం ప్రారంభం కావడంతో ఎక్కడివారు అక్కడే మౌనంగా నిలబడి గీతాలాపన చేశారు.
లోకేశ్ రాజీనామా చేయాలి
డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతికబాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బయట సర్కిల్ నుంచి గురువారం ప్రదర్శనగా వారు ‘మండలి’కి చేరుకున్నారు.
ఈ సందర్భంగా.. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సిగ్గు సిగ్గు, వెన్నుపోటు పార్టీకి సిగ్గు శరము లేదు, ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.. పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు ఇస్తారా సిగ్గు సిగ్గు.. జీఓ నెం.4, 47లపై సీబీఐ విచారణ జరపాలి.. అంటూ వారు నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మండలిలో చర్చించాలని.. తక్షణమే సీబీఐ విచారణ జరపాలంటూ ప్లకార్డు, పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలందరూ పాల్గొన్నారు.


