డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులను ఓదారుస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా
రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక
వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు
నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని ఆవేదన
కేసును తక్షణమే సీబీఐకి అప్పగించాలని తండ్రి డిమాండ్
హైకోర్టుకు వెళ్తామని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: డాక్టర్ ప్రియాంక హత్యపై వైఎస్సార్‌సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆమె తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు చంద్రమ్మ, వెంకటేష్ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. తమ బిడ్డ ఎంతో కష్టపడి మెరిట్‌లో రాజమండ్రి కళాశాలలో సీటు తెచ్చుకుందని, ఆమెను కిరాతకులు బలి తీసుకున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు వైఎస్ జగన్‌ను కోరారు. కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను వైఎస్ జగన్ ఓదార్చి, పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఆ రాక్షసులకు మరణ శిక్ష పడే వరకు విశ్రమించం: ప్రియాంక తండ్రి వెంకటేష్
తమ బిడ్డను చంపిన రాక్షసులకు మరణ శిక్ష పడేవరకు విశ్రమించబోమని డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుకతో కలిసి వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్థిక స్థోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని మా బిడ్డను డాక్టర్‌ను చేశాం. మా బిడ్డ కూడా కష్టపడి చదివింది. మెరిట్‌లో పీజీ సీటు వచ్చిందని రాజమండ్రికి పంపిస్తే.. రాక్షసుల్లా కారుతో గుద్ది గుద్ది చంపేశారు.
ఈ నెల 2న ప్రియాంకకు పెళ్లిచూపులు జరిగాయి. 3న కాలేజీకి వెళ్లిన పాపను అదే రోజు రాత్రి పొట్టనబెట్టుకున్నారు. మేము ప్రాణాలతో ఉన్నా చనిపోయిన శవాలతో సమానం అయిపోయాం. ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి మాకు సరైన సమాచారం ఇవ్వలేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. నిందితులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా లేదా అనే పరీక్షల వివరాలు కూడా బయటపెట్టలేదు.
స్థానిక పోలీసులు, అధికారులపై మాకు ఏమాత్రం నమ్మకం లేదు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మా పాపను పొట్టనబెట్టుకున్న హంతకులకు ఉరిశిక్ష పడేవరకు మా పోరాటం ఆగదు. వాళ్లు తప్పించుకోలేరు. ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై మేం హైకోర్టుకు కూడా వెళ్తాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశాం. చట్ట ప్రకారం వాళ్లకు శిక్షలు పడేలా చేస్తామని, బాధపడవద్దు అని వైఎస్ జగన్ మమ్మల్ని ఓదార్చి, మాకు ధైర్యం చెప్పారు.
ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం: మాజీ ఎంపీ బుట్టా రేణుక
పలుకుబడి ఉన్న నిందితులను కాపాడాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. కిరాతకంగా హత్య చేసిన వారికి కఠిన శిక్షలు పడాలి. బాధిత చేనేత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతాం.
నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరు?: మాజీ ఎంపీ మార్గాని భరత్
ఉద్దేశపూర్వకంగా కారును మూడుసార్లు డాక్టర్ ప్రియాంక తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఘటన జరిగిన రాత్రి కేవలం మాల్ దగ్గరి సీసీ ఫుటేజ్ మాత్రమే చూపించారు. మిగిలిన సిటీ సీసీ ఫుటేజీలను, నిందితుల కాల్ డేటా ఎందుకు బయటపెట్టడం లేదు? పైగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంటూ కేసు నమోదు చేయడంలో ఆంతర్యమేంటి? నిందితులు మద్యం, డ్రగ్స్ సేవించిన విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు? నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరో తేల్చాలి. నిందితులతో పాటు వారికి కూడా కఠినమైన శిక్షలు పడాలి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బాజీలాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇంత దారుణ ఘటన జరిగిన కాసేపటికే బాధ్యతగల డీఎస్పీ అదే మాల్‌లో సినిమాకి వెళ్లడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం.


