వైఎస్ జగన్‌ను తిట్టిపోయడమే అసెంబ్లీ సమావేశాల ఏకైక అజెండా
డీఎస్సీ కుంభకోణంపై చర్చ జరగకుండా శాసన మండలి నుంచి పరార్
అసెంబ్లీలో మాత్రం ఆ కుంభకోణాన్ని డైవర్ట్ చేసేలా అబద్ధాలు
డైవర్షన్ కోసం సందర్భం లేకుండా గ్రూప్–1 నియామకాలపై చర్చ
నాలుగు రోజులూ ఆత్మస్తుతి.. పరనిందే
సాక్షి, అమరావతి: నాలుగు రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆత్మస్తుతి, పరనిందలా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు ఈ సమావేశాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మరోవైపు.. తన పాలన గురించి, ఈ రెండేళ్లలో జరిగిన కుంభకోణాల గురించి ఆయన తన తనయుడు లోకేశ్‌తో కలిసి ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ మొత్తం 25.15 గంటలపాటు సాగింది. అందులో ఏకంగా 22 గంటలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లేందుకే వెచ్చించారు.
చంద్రబాబు మొదలు ఆయన తనయుడు లోకేశ్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్‌ను ఆడిపోసుకోగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తండ్రీకొడుకులను మెప్పించడం కోసం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చెప్పుకోవడానికి చేసిందేమీలేక జగన్‌ను తిట్టడం ద్వారా డైవర్షన్ రాజకీయాలకు దిగారు.
అసెంబ్లీలో దాటవేత రాజకీయం..
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో డీఎస్సీ నియామకాల కుంభకోణంపై చర్చ పెట్టి అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జబ్బలు చరుచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఇదే అంశంపై ఒకే ప్రజెంటేషన్‌ను రెండుసార్లు చూపిస్తూ మాట్లాడారు. కానీ, కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. సభలో తమను ప్రశ్నించేవారు ఎవరూ లేకపోవడం, తాము చెప్పిన అబద్ధాలనే గొప్ప శ్లోకాలుగా కీర్తించే ఎమ్మెల్యేలు ఉండడంతో అసెంబ్లీని అందుకోసం ఉపయోగించుకున్నారు.
డీఎస్సీపై చర్చకు బెదిరి ‘మండలి’లో పరార్..
మరోవైపు.. డీఎస్సీ అంశంపై శాసనమండలిలో చర్చించేందుకు ముందుకురాకుండా కూటమి సభ్యులు పారిపోయారు. డీఎస్సీ కుంభకోణంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు నాలుగు రోజులపాటు పట్టుబట్టారు. అసెంబ్లీలో చెప్పినట్లే మండలిలో ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం కుదరదని, నిజాలు బయటపడతాయన్న భయంతో చర్చకు దిగే ధైర్యం చేయలేక తప్పించుకుని పారిపోయింది. డీఎస్సీపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించిన ఆ శాఖా మంత్రి లోకేశ్.. మండలిలో చర్చించేందుకు భయపడి వెనక్కి వెళ్లిపోవడాన్ని బట్టి తాను పేపర్ టైగర్‌నని నిరూపించుకున్నారు.
డైవర్షన్ కోసం గ్రూప్–1 నియామకాలపై చర్చ..
అదే సమయంలో డీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్–1 నియామకాలపై చర్చను తెరపైకి తెచ్చారు. ఈ చర్చలో చంద్రబాబు వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ కళ్లుమూసుకుని అబద్ధాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి, నిండు సభలో నిస్సిగ్గుగా అవాస్తవాలు చెప్పి తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవని మరోసారి నిరూపించారు. చివరి రోజు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేసినట్లు సభ్యులతో మాట్లాడించి ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు.
సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి్సన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న సంగతే మరిచిపోయి ఎప్పటిమాదిరిగా టీడీపీ నేతలా వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. మొత్తంగా ఈ నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలను చర్చించడానికి కాకుండా జగన్‌ని తిట్టిపోయడానికి, డీఎస్సీ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తండ్రీకొడుకులు వాడుకున్నారని స్పష్టమైంది.


