
‘ఎక్స్’లో మంత్రి లోకేశ్ ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 22 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టుచేశారు. ఈ సెలవులు సోమవారం నుంచే ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్న విషయాన్ని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి కోరిక మేరకు ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేసినా విద్యాశాఖ మంత్రిగాని, అధికారులుగాని స్పందించలేదు. అలాగే, ఎస్జీటీల ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ సాధ్యంకాదనితేల్చిచెప్పిన లోకేశ్ గంట వ్యవధిలోనే ఎమ్మెల్సీల సూచన మేరకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ చేపడతామని ప్రకటించారు. స్పౌజ్ కేటగిరీలో అంతర్ జిల్లా బదిలీలను కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరినా పట్టించుకోని లోకేశ్.. ఎమ్మెల్సీలు కోరగానే బదిలీలు చేపడుతున్నట్లు ప్రకటించారు.