చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ.. అసలేం జరుగుతోంది..? | Dog Crucial in Missing Kakinad Child Case Died | Sakshi
Sakshi News home page

చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?

Jun 13 2026 3:59 PM | Updated on Jun 13 2026 5:51 PM

Dog Crucial in Missing Kakinad Child Case Died

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి,. చిన్నారి అన్వేషణలో కీలకంగా మారిన కుక్క ఎపిసోడ్‌ విషాదాంతమైంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.

గాలింపు ఇలా..!
సుమారు వారం రోజుల నుంచి పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ పర్యవేక్షణలో పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అటవీ శాఖ, ఏఎన్‌ఎస్‌, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్‌ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.

ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్‌ మెటల్‌ డిటెక్టర్లను వినియోగించారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్‌ టవర్‌ డంప్‌ డేటా, కాల్‌ డిటైల్‌ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతున్న సమయంలో కుక్క చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే? ట్విస్ట్..

కుక్కలో వింత ప్రవర్తన..!
ఈనెల 6 వ తేదిన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి అదృశ్యమైన పెంపుడు కుక్క... *మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ కుక్కలో వింత ప్రవర్తన మొదలైంది. జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని మొరుగుతూ కరిచే ప్రయత్నం చేసింది.  ఈ క్రమంలోనే రెండోసారి కూడా అదృశ్యమై, మళ్లీ ఇంటికి వచ్చింది. ఈసారి కుక్కకు జీపీఎస్‌ అమర్చి.. చిన్నారి ఆచూకీ కోసం కుక్కను కీలకంగా చేసుకున్నారు అధికారులు. అయితే ఇది కూడా ఉపయోగం లేకుండానే పోయింది. తిరిగి, తిరిగి ఇంటికి చేరిన కుక్క.. అనూహ్యంగా మృత్యువాత పడింది. చిన్నారి ఆచూకీ మాత్రం కుక్కకు తెలిసే ఉండవచ్చని, కుక్క వింతగా ప్రవర్తించడం వెనుకు ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మరొకవైపు గ్రామస్థులు, బంధువులు కూడా కుక్క వింత ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించకపోగా, ఇప్పుడు కీలకం అనుకున్న కుక్క మృతి చెందడంతో చిన్నారి మిస్సింగ్‌  కేసులో ఏం జరుగుతుంది? అనే చర్చ మొదలైంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement