2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి | District wise Labor Budget Design in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి

Jan 21 2022 5:46 AM | Updated on Jan 21 2022 5:46 AM

District wise Labor Budget Design in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు గ్రామాల వారీగా పనులు కావాలని కోరుకుంటున్న వారిని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదిత లేబర్‌ బడ్జెట్‌ రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా ఒక్కో జిల్లాలో మూడుకోట్లకుపైగా పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పనిదినానికి 60:40 నిష్పత్తిన కూలీకి ప్రస్తుత రేట్ల ప్రకారం గరిష్టంగా రూ.245 వేతన రూపంలో చెల్లించడంతోపాటు మెటీరియల్‌ విభాగంలో మరో రూ.163 కేటాయిస్తారు. కూలీలు వారు కోరుకున్నప్పుడు వారి సొంత గ్రామంలోనే పనులను కల్పించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో కొత్త పనులు గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ల ఆధ్వర్యంలో  ప్రస్తుతం కొనసాగుతోంది.

ఇలా గుర్తించిన పనులకు మొదట గ్రామసభ, తరువాత పంచాయతీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత లేబర్‌ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే.. ప్రసుత ఉపాధి పథకం కూలీరేట్ల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కూలీలకు గరిష్టంగా రూ.7,350 కోట్లు వేతనాల రూపంలో లభించే అవకాశం ఉంది. కూలీలకు గిట్టుబాటయ్యే సరాసరి వేతనాల మొత్తం ఆధారంగా గరిష్టంగా మరో రూ.4,890 కోట్లు మెటీరియల్‌ కోటాలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. 

56.98 లక్షల కుటుంబాలకు ప్రయోజనం 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 97.73 కోట్ల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధిహామీ పథకం కూలీలుగా నమోదయ్యారు. వీరిలో 56.98 లక్షల కుటుంబాల వారు క్రియాశీలకంగా ఏటా పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 45.45 లక్షల కుటుంబాలకు 21.73 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. రూ.4,817 కోట్లను కూలీలకు వేతనాల రూపంలో చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఇప్పటి నుంచి మళ్లీ ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి 26 కోట్ల పనిదినాల పాటు పనుల కల్పన పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement