
రేపటి నుంచి లబ్ధిదారులకు మరో విడత వైద్య పరీక్షలు.. మార్గదర్శకాలు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం
ఈ సర్కారు రాగానే ఇప్పటికే 5.50 లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తి
అందులో 1.37 లక్షల మందిని అనర్హులుగా తేల్చి పింఛన్ల రద్దు లేదా తగ్గింపునకు నోటీసులు జారీ
లబ్ధిదారుల ఆందోళనలు, ‘సాక్షి’ కథనాలతో అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
తన పంతం ఎలాగైన నెగ్గాలని ఇప్పుడు మళ్లీ 1.10 లక్షల మందికి నోటీసులు
అనర్హులుగా తేలితే పెన్షన్లు రద్దు చేస్తామంటున్న అధికార వర్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ దారులకు రీ వెరిఫికేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏళ్ల తరబడి పెన్షన్ తీసుకుంటున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను ఎలాగైనా కుదించాలన్న కుట్రతో వెరిఫికేషన్ ప్రక్రియకు తెరతీసింది. వైకల్యం నిరూపించుకోవాలంటూ ఇప్పటికే లబ్ధిదారులకు ఒకసారి నోటీసులిచ్చి రీవెరిఫికేషన్ పూర్తిచేయగా.. ఇప్పుడు తాజాగా ఈనెల 8 నుంచి మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విడతల వారీగా నోటీసులివ్వడం ప్రారంభించింది.
నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనర్హుల ఏరివేత పేరిట పింఛను అర్హతను నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీచేసింది. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులు 24,091 మందితో పాటు దివ్యాంగుల కోటా పింఛన్లు పొందుతున్న 7,86,091 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8.18 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, వీరిలో కొందరికే నోటీసులిచ్చి 5.50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది లబ్ధిదారులు అనర్హులంటూ వీరి పింఛన్లు పూర్తిగా రద్దుకు రెండునెలల క్రితమే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.
అలాగే, 30వేల మందికి వారు ప్రస్తుతం పొందుతున్న రూ.15 వేల పింఛన్‌ను రూ. 6వేలు లేదా రూ. 4 వేలకు మార్చేందుకు కూడా నోటీసులిచ్చింది. అయితే, వీటిని అందుకున్న దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం.. పింఛన్ల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ కుట్రలను ‘సాక్షి’ ఎండగట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబరు ఒకటిన జరిగే పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే, తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు మళ్లీ రీవెరిఫికేషన్ అంటోంది. రెండు నెలల క్రితం పింఛను రద్దు లేదంటే పింఛన్ కేటగిరి మార్పునకు నోటీసులిచ్చిన వారిలో దాదాపు 1.10 లక్షల మందికి ఈనెల 8న మళ్లీ వైద్య పరీక్షలు మొదలుపెట్టనుంది. ఈసారి పరీక్షల్లో అనర్హులుగా తేలితే పింఛను పూర్తిగా రద్దుచేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆసుపత్రుల వద్దే పరీక్షలు..
ఇక పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత వంటి వ్యాధులతో మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటూ ఫించన్లు పొందుతున్న 24 వేల మంది లబ్ధిదారులకు తొలివిడత వైద్య పరీక్షలను ఇంటివద్దే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో మాత్రం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాల్సిందేనని తాజా మార్గదర్శకాల్లో తేలి్చచెప్పింది. వీరిలో ఎంపికైన అతికొద్ది మందికి మాత్రమే రోజుకు ఐదుగురు చొప్పున 108 లేదా 104లో ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
టీడీపీ సానుభూతిపరులకైతే నో వెరిఫికేషన్..
ఇదిలా ఉంటే.. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ రాజకీయ వేధింపుల మాదిరిగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. మొత్తం 8.18 లక్షల మంది దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులందరినీ అప్పట్లో రీవెరిఫికేషన్ జరుపుతున్నట్లు ప్రకటించి.. వీరిలో కేవలం ఐదున్నర లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో లక్ష మందికి పూర్తిగా పింఛను రద్దుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇప్పుడు వీరికి మళ్లీ రెండో విడత రీ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు మొదలుపెడుతున్నారు. అయితే, దాదాపు రెండున్నర లక్షల మంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.
మిగిలిన వారి మీద మాత్రం ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో ముద్రవేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, దాదాపు పదిహేను ఏళ్ల క్రితం కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణనలో రాష్ట్రవ్యాప్తంగా 12,19,785 మంది దివ్యాంగులు ఉన్నారని తేలింది. కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ కేటగిరీ పెన్షనర్ల సంఖ్య అంతకన్నా చాలా తక్కువే. అయినా.. ఇందులోనూ కోత విధించేందుకు గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చిందంటూ రీవెరిఫికేషన్ జపం చేస్తోంది.