
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో వెలసిన సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ డిప్యూటీ ఎండీ మట్టే ఆదిశంకర్, స్రవంతి దంపతులు రూ.20 లక్షలతో వజ్రాల హారం తయారు చేయించారు.
తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై స్వామివారి ఆలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ హారాన్ని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేశారు. వంద గ్రాముల బంగారం, 22 గ్రాముల బరువైన 174 వజ్రాలతో దీనిని తయారు చేయించినట్లు దాత తండ్రి, శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్ తెలిపారు.
రత్నగిరి కిటకిట
తొలి ఏకాదశి (Tholi Ekadasi) పర్వదినం సందర్భంగా ఆదివారం అన్నవరం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వారి దర్శానికి తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడింది. 75 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఘనంగా ఏకాదశి పూజలు
రత్నగిరి వాసుడు సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి తులసి దళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి ప్రసాదాలు నివేదించి, పండితులు వేదాశీస్సులు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన ఈ పూజలు నిర్వహించారు.
చదవండి: తూర్పు తీరంలో పగడపు దిబ్బలు