ఎన్నాళ్లీ మరమ్మత్తులు! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ మరమ్మత్తులు!

Mar 4 2026 7:50 AM | Updated on Mar 4 2026 7:50 AM

పూర్తికాని వంతెనల మరమ్మతులు

పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌

వాహనాల రాకపోకలకు అవస్థలు

ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం

కంకర లారీపై రూ.3 వేల అదనపు భారం

కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి వ్యాపారుల కొనుగోలు

మలికిపురం: గోదావరి పాయలు, సముద్ర తీరంతో కనువిందు చేసే రాజోలు దీవిలో ప్రజల రాకపోకలతో పాటు సరకుల రవాణాకు వంతెనలు ఎంతో కీలకం. బయటకు రావాలన్నా, లోపలకు వెళ్లాలన్నా వీటి మీదగానే ప్రయాణం సాగిస్తారు. అయితే ఈ వంతెనలను కొన్ని రోజులుగా మరమ్మతుల పేరుతో మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిండి – చించినాడ వంతెన ఎనిమిది నెలలు, పి.గన్నవరం వంతెన రెండు నెలల పాటు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల రవాణాతో పాటు వాణిజ్య పంటల ఎగుమతులకు కష్టం కలుగుతోంది. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఇప్పటికే ప్రజలు రూ.లక్షల అదనపు భారం మోశారు. ఇంకా మోస్తూనే ఉన్నారు.

దూరాభారం

రాజోలు దీవికి ఐరన్‌, ఎలక్ట్రికల్‌ తదితర వస్తువులు విజయవాడ, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. కంకర, ఇనుము, నిత్యావసరాలు, దుస్తులు రాజమహేంద్రవరం, పంగిడి నుంచి దిగుమతి అవుతాయి. ఇవన్నీ రావాలంటే దిండి – చించినాడ, పి.గన్నవరం వంతెనలే దిక్కు. అలాగే ఇసుక రావాలన్నా ఈ రెండు వంతెనలే ఆధారం. ప్రస్తుతం ఈ వంతెనలను మరమ్మతుల పేరుతో నిలిపివేయడంతో పాలకొల్లు నుంచి రావులపాలెం, సిద్ధాంతం వంతెనల మీదుగా అమలాపురం సమీపంలోని పాశర్లపూడి వంతెన నుంచి రావాల్సి వస్తోంది. దీంతో దూరాభారం, లోల్‌గేట్‌ ఖర్చు అధికమై తడిసి మోపెడు అవుతుంది. ఇదంతా వినియోగదారులపైనే పడడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు వంతెనలు బాగాయ్యే దాకా పనులు చేయలేమని చేతులెత్తేశారు. ఇప్పటికే గిట్టుబాటు కాక, బిల్లులు రాక సతమతం అవుతున్న తమకు తీవ్ర నష్టం వస్తుందని స్పష్టం చేశారు.

రైతుల అవస్థలు

వంతెనల మరమ్మతుల ప్రభావం రాజోలు దీవిలో వాణిజ్య పంటలైన కొబ్బరి, సరుగుడు ఎగుమతులపై కూడా పడింది. కొబ్బరి కాయకు రూ.రెండు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమంటే వంతెనల వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, గతంలో ఇచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. సరుగుడు రైతులదీ ఇదే పరిస్థితి.

మూసివేతతో..

దిండి – చించినాడ వంతెన మూసివేత వల్ల అమలాపురం తదితర ప్రాంతాలపై కూడా భారం పడుతోంది. సాధారణంగా పశ్చిమ గోదావరి వైపు నుంచి వచ్చే లారీలు దిండి వంతెన మీదుగా పాశర్లపూడి వంతెన దాటి అమలాపురం వైపు వెళతాయి. ఇక్కడ వంతెన మూసివేతతో ఇవన్నీ సిద్ధాంతం వైపు వెళ్లి, తిరిగి అమలాపురం రావాల్సి వస్తోంది. ప్రధానంగా కొబ్బరి లారీల లోడ్‌ విషయంలో ఈ ఇబ్బంది కలుగుతోంది. అలాగే పాలకొల్లు – అమలాపురం మధ్య జరిగే వస్తు రవాణాకు కూడా అవస్థలు కలుగుతున్నాయి. ఇక విద్యార్థుల ఇబ్బందులు షరా మమూలే. వంతెనపై అరగంటకు పైగా ఎండ, మంచులలో నడవాల్సి వస్తోంది.

ప్రజలపై అదనపు భారం

వంతెనలను ఇలా ఒకేసారి మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలకు అడ్డంకితో పాటు, దిగుమతి చేసుకునే వస్తువులపై పెనుభారం పడుతోంది. సిమెంట్‌, ఇనుము, ఇసుక, కంకర వంటి నిర్మాణ వస్తువుల దిగుమతి విషయంలో లారీకి సుమారు రూ.3 వేల అదనపు భారం పడుతోంది.

– సుందర పండు, గూడపల్లి

కొబ్బరి రైతులకు నష్టం

వంతెనల మూసివేత భారం రైతులపై పడింది. ముఖ్యంగా కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. వంతెనల మూసి వేత కారణంగా పాశర్లపూడి వంతెన నుంచి దూరం తిరిగి లారీలు వెళ్లాల్సి రావడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

– దేశినీడి ఉదయ భాస్కరరావు, రామరాజులంక

ఎనిమితి నెలలుగా మరమ్మతులు పూర్తి కాని

దిండి – చించినాడ వంతెన

ఆలస్యానికి కారణం వివాదమేనా!

అధికారులు చెప్పిన ప్రకారం వంతెన మరమ్మతులు పూర్తి అవడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అలాగే వారు ప్రతిసారీ గడువు పొడిగిస్తున్నారు. చించినాడ వంతెనకు ఎనిమిది నెలలుగా మరమ్మతులు పూర్తి కాలేదు. ప్రస్తుతం వంతెన పిల్లర్లకు అమర్చాల్సిన బేరింగ్‌ల కొలతలు తీసి ఆర్డర్‌ ఇచ్చిన కారణంగా అవి వంతెన వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వంతెన నిర్మించిన సంస్థకూ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఇలా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement