వ్యాన్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ ఢీకొని యువకుడి మృతి

Mar 4 2026 7:50 AM | Updated on Mar 4 2026 7:50 AM

ఆటో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలు

బాసవాగు వద్ద ఘటన

ఎటపాక: వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఆటోలో వస్తున్న యువకుడు మృతి చెందాడు. 30వ నంబర్‌ జాతీయ రహదారిపై బాసవాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీదేవిపేటకు చెందిన పైల రమేష్‌, సీత దంపతుల కుమారుడు పైల సాయి (26) విస్సాపురం పంచాయతీ పరిధిలోని బండిరేవు గ్రామంలో బైక్‌ మెకానిక్‌ షెడ్డు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై మెకానిక్‌ షెడ్డుకు వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనాల స్పేర్‌ పార్టులు, ఇంజిన్‌ ఆయిల్‌ కొనుగోలు చేసేందుకు బండిరేవు గ్రామంలోని ఈశ్వర్‌ ఆటోలో భద్రాచలం వెళ్లాడు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని అదే ఆటోలో మరో ఇద్దరు ప్రయాణికులతో కలిసి బండిరేవు వస్తున్నాడు. ఈ క్రమంలో బాసవాగు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న టోల్‌ప్లాజా వద్ద ఇరుకు రహదారిలో చింతూరు నుంచి భద్రాచలం వైపు వస్తున్న వ్యాన్‌ అతివేగంగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సాయికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ ఈశ్వర్‌తో పాటు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు గ్రామానికి చెందిన మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికులు ఆ వ్యాన్‌ డ్రైవర్‌ను పట్టుకుని ఘటన ప్రాంతానికి వచ్చిన పోలీసులకు అప్పగించారు. సాయి మృతదేహానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement