ఫ ఇంటి నుంచి వెళ్లి పోయిన బాలిక
ఫ ఐదు గంటల్లోనే పోలీసుల గుర్తింపు
ఫ తల్లిదండ్రులకు అప్పగింత
అనపర్తి: ఇంటి నుంచి అదృశ్యమైన మల్లిడి విహారికారెడ్డి అనే 14 ఏళ్ల బాలికను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే ఆమెను గుర్తించినట్టు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాలు ఇవీ.. బలభద్రపురానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని విహారికారెడ్డి నెల రోజులుగా స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. అలాగే ఎక్కువ సమయం సెల్‌ఫోన్ చూస్తూ గడుపుతోంది. దీంతో ఆ బాలికను తండ్రి సత్యనారాయణరెడ్డి సోమవారం మందలించాడు. అనంతరం పని మీద రాజమహేంద్రవరం వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికీ విహారికారెడ్డి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్ సారథ్యంలో రంగంపేట, బిక్కవోలు ఎస్సై లు శివ ప్రసాద్, రవిచంద్ర కుమార్ మూడు టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం, బలబద్రపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ బాలిక విశాఖపట్నం వెళ్లినట్టు గుర్తించి, అక్కడి నుంచి బిక్కవోలు తీసుకుని వచ్చి మంగళవారం తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.


