మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదకర మలుపులు , గతేడాది లోయలో బస్సు పడిన ప్రాంతం
ప్రమాదకరంగా మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు
భద్రతా చర్యలు శూన్యం
తరుచూ ప్రమాదాలు జరుగుతున్నపట్టించుకోని అధికారులు
రెండేళ్ల కాలంలో పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం
రంపచోడవరం: మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే మారేడుమిల్లి – భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణికులకు భద్రత కరవైంది. ఈ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నా కనీస రక్షణ చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారులు విఫలమయ్యారు. అనేక సార్లు భారీ వాహనాలు నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వాహనాల్లోనే ప్రయాణికులు గంటలు తరబడి నరకయాతన పడుతున్నారు. ఇటీవల ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడి 17 మంది గాయపడ్డారు. ఘాట్ రోడ్డులో భద్రత వైఫల్యాలతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదకర మలుపులు
మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మధ్యలో పది వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటువంటి ఘాట్ రోడ్డులో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టలేదు.
ప్రతిపాదించినా..
ఘాట్ రోడ్డు సేప్టీ పనులు కోసం రూ.2 కోట్ల 60 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినా, రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రయాణికుల భద్రత చర్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపుల్లో రక్షణ కోసం ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలి.
కానీ అనేక చోట్ల రక్షణ చర్యలు లేవు. ఇటీవల రోడ్డు భవనాలు భవనాల శాఖ గోతులమాయంగా ఉన్న ఘాట్‌లో నాలుగు కిలోమీటర్లు మేర కొత్త రోడ్డును నిర్మించింది. పాములేరు నుంచి సింగిల్ రోడ్డు ఉండడంతో అనేక సార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్‌అండ్‌బీ శాఖ కిలోమీటరన్నర రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెడితే కేవలం 700 మీటర్ల మేర నిర్మాణానికే నిధులు మంజూరు చేశారు.
ప్రమాదాల్లో కొన్ని..
ఘాట్ రోడ్డులో గత ఏడాది యాత్రికుల బస్సు అదుపు తప్పి లోయలో పడి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు వాహనం మలుపు తిప్పుతుండగా లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగిల్ రోడ్డును డబుల్ చేసేందుకు పనులు మొదలు పెడతాం. ఇటీవల నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. త్వరలో మిగిలిన సింగిల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటాం. – ప్రదీప్, జేఈ, ఆర్‌అండ్ బీ
అవగాహన లేక..
ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్నిసార్లు భారీ వాహనాలు వెళ్లిపోతున్నాయి. అటువంటి సందర్భాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి కొందరు డ్రైవర్లకు ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
– ఐ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ, మారేడుమిల్లి
అధికారులు స్పందించాలి
ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సేప్టీ చర్యలు తీసుకోవాలి. – బాలు అక్కిస, హ్యూమన్ రైట్ వాచ్ చైర్మన్, రంపచోడవరం


