
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్‌కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్‌కు అర్జీ పెట్టారు.
ఇవాళ కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ నేడు కూడా కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది.
భైరవస్వామి హుండీలో నగదు చోరీ
శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవవాకలోని భైరవస్వామి ఆలయంలో రెండు హుండీల తాళాలు విరగ్గొట్టి నగదు చోరీ చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో గోపాలపట్నం క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. వివరాలిలోకి వెళ్తే.. గురువారం ఉదయం 6 గంటలకు తొలి షిఫ్టులో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో కలిసి వెళ్లి ఆలయ తలుపులు తెరచిన అర్చకుడు సంతోష్‌శర్మ ఆలయంలో ఉన్న రెండు స్టీల్ హుండీల తాళాలు విరగ్గొట్టి ఉండటాన్ని గమనించారు. పక్కనే త్రిశూలం పడి ఉండటాన్ని చూశారు. దీంతో దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు.
ఆలయం వద్దకు వచ్చిన క్రైమ్ ఎస్‌ఐ తేజేశ్వరరావు అంతా పరిశీలించారు. వేసిన ఆలయం తలుపులు వేసినట్టే ఉండటం, ఆలయంపై నుంచి ఎంతవరకు దొంగలు కిందకు దిగే అవకాశం ఉంది, త్రిశూలంతోనే హుండీల తాళాలు విరగకొట్టి ఉండవచ్చా.. తదితర విషయాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన రెండు నెలల నుంచి హుండీలను తెరవలేదు. హుండీల్లో రూ. 2 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.