డిజైన్‌కు తగ్గట్టుగానే పోలవరం గైడ్‌ బండ్‌ నిర్మాణం | Sakshi
Sakshi News home page

డిజైన్‌కు తగ్గట్టుగానే పోలవరం గైడ్‌ బండ్‌ నిర్మాణం

Published Fri, Jun 16 2023 4:49 AM

Construction of Polavaram Guide Bund according to the design - Sakshi

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌కు తగ్గట్టుగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోలవరం ప్రాజెక్టు గైడ్‌ బండ్‌ను నాణ్యంగా నిర్మించినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిపుణుల కమిటీ తేల్చింది. కానీ.. గైడ్‌ బండ్‌ కొంత భాగం కాస్త జారిందని,  ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విషయంపై మేధోమథనం జరిపింది. మట్టి పరీక్షల నివేదికలను పరిశీలిం చింది. గైడ్‌ బండ్‌ జారిన ప్రాంతానికి తాత్కాలిక మరమ్మతులపై నాలుగు రోజుల్లోగా ప్రతిపాదన ఇస్తే.. దాన్ని సరిచూసి సీడబ్ల్యూసీకి నివేదిస్తామని పేర్కొంది.

సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం తక్షణం మరమ్మతుల చేయాలని, ఆ తర్వాత  గైడ్‌ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు చేపట్టాలని  రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్‌  ఎస్కే సిబాల్, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) డైరెక్టర్‌ చిత్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్‌ సభ్యులుగా సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం  రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. స్పిల్‌ వే, గేట్లు, స్పిల్‌ చానల్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. గైడ్‌ బండ్‌ను సమగ్రంగా పరిశీలించింది.

పరిమితికి లోబడే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ లీకేజీలు
గతేడాది గోదావరికి భారీ స్థాయిలో వచ్చిన వరదలను దీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచింది. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో లీకేజీలను రీచ్‌లవారీగా ఎప్పటికప్పుడు అధునాతన హైడాల్రిక్‌ డాప్లర్‌ టూల్‌తో కొలుస్తున్నామని  రాష్ట్ర అధికారులు కమిటీకి వివరించారు. హైడ్రాలిక్‌ డాప్లర్‌ టూల్‌లో రికార్డయిన గణాంకాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని పేర్కొంది. వరదల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ కాఫర్‌ డ్యామ్‌ భద్రతను పర్యవేక్షించాలని సూచించింది.

యథాస్థితికి తెచ్చే పనులపై సంతృప్తి
గత ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసిన దిగువ కాఫర్‌ డ్యామ్‌ నాణ్యతపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్‌ వద్ద వరద ఉధృతికి ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులను పరిశీలించింది. ఈ పనులు పూర్తయ్యాక డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రం వాల్‌ వేసే పనులు చేపడతామని రాష్ట్ర అధికారులు వివరించారు. శుక్రవారం నిపుణుల కమిటీ మరో సారి రాష్ట్ర అధికారులతో సమావేశమై.. సాంకేతిక అంశాలపై చర్చించనుంది. క్షేత్ర స్థాయి పర్యటన.. అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది.

Advertisement
Advertisement