సీడబ్ల్యూసీ సీఈ వివేక్ త్రిపాఠి అధ్యక్షతన సాంకేతిక నిపుణుల బృందం ఏర్పాటు
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్‌ను పూడ్చివేసి, ఆప్రాన్‌ను యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక నిపుణుల బృందం(టీఈజీ) ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్(డిజైన్స్) వివేక్ త్రిపాఠి అధ్యక్షతన సీడబ్ల్యూసీ డైరెక్టర్లు సోమేష్‌కుమార్, సమర్థ్ అగర్వాల్, డిప్యూటీ డైరెక్టర్లు అరుణ్ ప్రతాప్‌సింగ్, మధుకంఠ్ గోయల్, సీఎస్‌ఎంఆర్‌ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్త మనీష్ గుప్తా, సీడబ్ల్యూపీఆర్‌ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్త ఎంకే వర్మ, జీఎస్‌ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) డైరెక్టర్ శైలేంద్ర సింగ్ సభ్యులుగా సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది.
ఈ బృందంలో సభ్యుడిగా చేర్చేందుకు ఇంజినీర్–ఇన్–చీఫ్, సీఈ స్థాయికి తక్కువ కాకుండా ఒక అధికారిని ప్రతిపాదించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయికి తక్కువ కాకుండా ఒక అధికారిని ఈ బృందంలో సభ్యుడిగా చేర్చేందుకు ప్రతిపాదించాలని పేర్కొంది. ఈ నిపుణుల బృందానికి సీడబ్ల్యూసీ డైరెక్టర్ సమర్థ్ అగర్వాల్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కృష్ణా నదికి వచ్చే భారీ వరదల ఉధృతి ప్రభావం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ఆప్రాన్ కోతకు గురై పెద్ద గొయ్యి(ప్లంజ్ పూల్) ఏర్పడింది.
ఇది శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు సవాల్‌గా మారింది. తక్షణమే ప్లంజ్ పూల్‌ను పూడ్చి వేసి, ఆఫ్రాన్‌ను యథాస్థితికి తేవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు సాంకేతిక నిపుణుల బృందాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్ నిరుపమ్ ప్రసాద్ ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను, డాక్యుమెంట్లను క్షేత్రస్థాయి పర్యటనకు వచి్చనప్పుడు సాంకేతిక నిపుణుల బృందానికి అందించాలని.. ప్రత్యేకమైన అధ్యయనాలు నిర్వహించడానికి యువ అధికారులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక సాంకేతిక నిపుణుల బృందం చేసిన సూచనల మేరకు నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని షరతు విధించారు.
ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అసహనం
ప్రాజెక్టు భద్రతపై 2025, మార్చి 6న నిర్వహించిన సమీక్షలో ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2025 జూలై 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు. ప్లంజ్ పూల్‌ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు.


