ప్రస్తుత ప్రాజెక్టులకు 299 టీఎంసీలతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి అదనంగా 188 టీఎంసీలు ఇవ్వాలి
గోదావరి మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలతో ‘పాలమూరు’కు అనుమతి ఇవ్వాలి
జల వివాదాల కమిటీకి ప్రాథమిక ఎజెండాను తెలిపిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల నుంచి తమ రాష్ట్రానికి 532 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ కోరింది. ప్రస్తుత ప్రాజెక్టులకు తాత్కాలికంగా కేటాయించిన 299 టీఎంసీలకు అదనంగా నిర్మాణం, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు మరో 188 టీఎంసీలను కేటాయించాలని డిమాండ్ చేసింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జలవివాదాల కమిటీ సమావేశంలో ఈ మేరకు తమ రాష్ట్ర ప్రాథమిక ఎజెండాను తెలంగాణ తెలియజేసింది. ఈ ఎజెండాలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
» కృష్ణా పరీవాహకంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు తాత్కాలికంగా కేటాయించిన 299 టీఎంసీ లకు అదనంగా, 2014కు ముందు నుంచి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 188 టీఎంసీలను కేటాయించాలి.
» కృష్ణా ట్రిబ్యునల్–2 తుది కేటాయింపులు జరిపే వరకు ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలను తాత్కాలికంగా పంపిణీ చేయాలి.
» పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి మళ్లిస్తే దానికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ ఎదుట ఒప్పందం జరిగింది. ఎగువ రాష్ట్రాల వాడకం పోగా ఉమ్మడి ఏపీ వాటా కింద మిగిలి ఉన్న 45 టీఎంసీల ఆధారంగా తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలి.
» శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించకుండా ఏపీని కట్టడి చేయాలి.
» కృష్ణా జలాల వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి అన్ని ప్రాజెక్టులపై టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
» నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణను పూర్తిగా తిరిగి తెలంగాణకు అప్పగించాలి. సాగర్ ఎడమ కాల్వతో సహా ఇతర అన్ని విభాగాల నిర్వహణ తెలంగాణ ఆధ్వర్యంలో జరగాలి.
» ఒక నీటి సంవత్సరంలో వాడుకోకపోవడంతో మిగిలిపోయే నీటి వాటాలను బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా మరుసటి ఏడాది సంబంధిత రాష్ట్రానికి పునఃకేటాయింపులు జరపాలి.
» బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి వినియోగిస్తున్న జలాల్లో 80 శాతం మళ్లీ రిటర్న్ ఫ్లో రూపంలో నదిలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటికి వినియోగించే 100 టీఎంసీల్లో 80 టీఎంసీలను మినహాయించి 20 టీఎంసీలనే లెక్కించాలి.
» రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునీకీకరణ చేపట్టాలి.
» శ్రీశైలం ప్రాజెక్టుకు అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి.
» వరదల సమయంలో శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి జరిపి సాగర్‌లోకి నీటిని విడుదల చేసేందుకు, ఆ తర్వాత సాగర్‌లో జలవిద్యుదుత్పత్తి చేసి పులిచింతల నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఇవ్వాలి. వచ్చిన వరదను వచి్చనట్టే ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తుండడంతో జలవిద్యుదుత్పత్తి తగ్గిపోతోంది.
» గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి 200 టీఎంసీల జలాలను తరలించుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
» పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం మేర నీరు నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడే ముంపు సమస్యను పరిష్కరించాలి.


