రేపు జల వివాదాల కమిటీ తొలి భేటీకి హాజరుకానున్న తెలంగాణ
ఏపీ నల్లమలసాగర్‌ను ప్రస్తావిస్తే వ్యతిరేకించాలని నిర్ణయం
ఫైవ్ పాయింట్ ఎజెండాను ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్
తెలంగాణలోని ప్రాజెక్టులే ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశానికి ఎలాంటి ఎజెండా లేకుండానే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలో భేటీ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత అంశాలతో ఎజెండాను పంపించాలని రెండు రాష్ట్రాలను కేంద్రం కోరింది. అయితే కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించాల్సిన, చర్చించకూడని అంశాలపై తొలి సమావేశంలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శాశ్వత ఎజెండాను ఖరారు చేసేలా 30వ తేదీన కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీ మాత్రం ఐదు అంశాలతో కూడిన ఎజెండాను కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలిసింది.
తెలంగాణ ప్రాజెక్టులే ఏపీ ఎజెండా
తెలంగాణలోని ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఏపీ ఎజెండాను ప్రతిపాదించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) ఇచ్చిన అనుమతుల పత్రాలు అందజేయాలని కోరనుంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనుంది. ఇక సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా కృష్ణా పరీవాహకంలో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, వాటిని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలను వివరించాలని కోరనుంది. కృష్ణా/ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటాలపై స్పష్టత ఇవ్వాలని కోరడంతో పాటు పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.
అయితే పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 30న భేటీలో ఈ అంశాన్ని ఏపీ ప్రతిపాదిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది.


