
వీవీవీ పాఠశాల ఉపాధ్యాయులకు వీఆర్‌ఎస్ యత్నం
స్టీల్‌ప్లాంట్‌కు ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార్సు
బయటపడ్డ కూటమి నైజం
సాక్షి, విశాఖపట్నం: పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బ్రతిమాలుతుంటే ఆ పాఠశాల ఉపాధ్యాయులకు వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్) ఇచ్చి పంపేయాలని విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలు ఉక్కు యాజమాన్యానికి సిఫార్సు చేయడం పట్ల అందరూ నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్నవారు పాఠశాలను నిలబెట్టాల్సింది పోయి మూసివేయడానికి మద్దతివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు దశాబ్దాల క్రితం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల కోసం ఉక్కునగరంలోని సెక్టార్–5లో విశాఖ విమల విద్యాలయం(వీవీవీ) తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు.
నగరానికి చెందిన డయాసిస్ సంస్థకు పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అక్కడి ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించేవారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో 28 మంది పర్మినెంట్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, 60 మంది సిబ్బంది ఉన్నారు. పాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ.5 కోట్లు వ్యయం అవుతోంది. ఫీజుల రూపేణా రూ.2 కోట్లు వసూలవుతుండగా, మిగిలినది ఉక్కు యాజమాన్యం సహాయంగా అందజేస్తూ వస్తోంది.
గతేడాది ఉక్కు యాజమాన్యం పాఠశాల నిర్వహణకు తాము సహకరించలేమని, సొంత నిధులతో నిర్వహించుకోవాలని తేల్చింది. దీంతో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఆ ఒత్తిడికి లొంగి గతేడాది పాఠశాల నిర్వహణకు యాజమాన్యం ముందుకు వచ్చింది. ఈ ఏడాది కథ మళ్లీ మొదటికి రాగా.. మూడు నెలల క్రితం డయాసిస్ సంస్థ పాఠశాల కొనసాగించడానికి అనుమతి కోసం ఉక్కు యాజమాన్యానికి లేఖ రాసింది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన కనిపించలేదు.
ఇతర పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలవుతున్నా వీవీవీ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై గత నెల 23న ఉక్కు యాజమాన్యం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో యాజమాన్యం పాఠశాలను తెరవడానికి సంబంధించిన అనుమతి పత్రం ఇస్తామని చెప్పినట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇది జరిగి రెండు వారాలు కావస్తున్నా పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బట్టబయలైన కూటమి ప్రభుత్వ నైజం..
ఇదిలా ఉండగా ఈ అంశంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్‌లను కలిసి పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రయత్నిస్తున్నామని, ఉక్కు యాజమాన్యం వినటం లేదని ఎంపీ, ఎమ్మెల్యే పలుమార్లు వారికి చెబుతూ వచ్చారు. ఒకవైపు వారితో అలా చెబుతూ మరోవైపు యాజమాన్యానికి ఉపాధ్యాయుల వీఆర్‌ఎస్ కోసం సిఫార్సు చేయడం పట్ల కూటమి ప్రభుత్వం నైజం బయట పెట్టారు.