
మరోసారి ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్ల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధం
మేలో కోర్టును సైతం లెక్క చేయకుండా రూ.3,489 కోట్ల విలువైన బాండ్లు జారీ
రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పిస్తూ అప్పుల కోసం వెంపర్లాట
దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు.. అయినా లెక్కచేయకుండా బరితెగింపు
ఈ నెల 24న మళ్లీ బాండ్ల జారీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్‌సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమైంది.
గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది.
తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.
అత్యధిక వడ్డీ భారం
మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ (ఎస్‌డీఎల్) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.
⇒ గతంలో ఏపీ సీఆర్‌డీఏ (ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ), ఏపీ ఎస్‌బీసీఎల్ (ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం.
⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్ లోన్‌తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది.
హైకోర్టులో కేసున్నా...
ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు.
ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్‌మ్యాప్‌పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కీలక ప్రశ్నలు
–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
–డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?
–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?
–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?
–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా?