సాయంలో కొత్త ఒరవడి | Sakshi
Sakshi News home page

సాయంలో కొత్త ఒరవడి

Published Wed, Aug 9 2023 4:14 AM

CM YS Jagan visit to Flood Victims In Godavari Lanka Villages - Sakshi

వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్‌ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది.
 – లంక వాసులతో సీఎం జగన్‌

సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

గోదావరి వరదల బారిన పడిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్‌ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు.

‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. 
తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఉదారంగా ఉండాలన్నాను..
పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొని­యాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్‌ గ్రామీణ స్థాయి­లో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఆర్‌బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. 

నెలాఖరుకు పంట నష్ట పరిహారం
పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతు­లకు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్‌బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్‌బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామ­న్నారు.

అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూర­గాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నా­మని, టీఎంఆర్‌ (టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాల­యం, వలంటీర్‌ వ్యవస్థలు, విలేజ్‌ క్లినిక్‌లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు.

మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్‌ అన్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్‌ను చూసి ‘వైనాట్‌ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్‌ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు.   
గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్‌  

సీఎంకు ఘన స్వాగతం 
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల­రావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్, కొండేటి చిట్టి­బాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్‌ అజయ్‌లు పాల్గొన్నారు.

నేరుగా జనం మధ్యకే..
మంగళవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్‌లో చేరుకు­న్నారు.  సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్‌ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు.

సీఎం జగన్‌ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే అని వారు సంబర పడ్డారు.

1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్‌ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెద­పూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు.  

 
Advertisement
 
Advertisement