ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలకు 342 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 342 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈవో కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 40 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలను ప్రశాంతంగా రాశారన్నారు. ఈ మేరకు డీఐఈవో అమలాపురంలో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 11,902 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ 11,560 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం హాజరు శాతం 97.12 నమోదైందన్నారు. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనరల్, ఒకేషనల్, ఇంగ్లిషు పరీక్షలు జరుగుతాయని డీఐఈవో వెల్లడించారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే అంటే ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని డీఐఈవో సూచించారు.
ఆయన ప్రతిభతో
జిల్లా ముందంజ
అమలాపురం రూరల్: తన ప్రతిభతో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపిన ఘనత డ్వామా పీడీగా పనిచేసిన ఎస్.మధుసూదన్‌కు దక్కుతుందని ప్లాంటేషన్ మేనేజర్ బెల్లం త్రినాథ్ అన్నారు. మధుసూదన్ జిల్లా పరిషత్ సీఈవోగా పదోన్నతి పొందిన సందర్భంగా కలెక్టరేట్‌లో మంగవారం ఉద్యోగులు అభినందన సభ నిర్వహించారు. త్రినాథ్ మాట్లాడుతూ పదోన్నతి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాక, మొత్తం టీమ్‌కు వచ్చిన గౌరవమని అన్నారు. మధుసూదన్ మాట్లాడుతూ విధి నిర్వహనలో సహకారం అందించిన ఉద్యోగులు ,అఽధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.రమేష్ టెక్నికల్ అసిస్టెంట్ జె.సురేష్, నాగేంద్ర ఉద్యోగులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్ ద్వారా
భూ సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం రూరల్: రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి మంగళవారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు, మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రీ సర్వే, కుల విచారణ, ఐవీఆర్‌ఎస్ సేకరణ రెవెన్యూ డిజిటల్ రికార్డుల రూపకల్పన పురోగతిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మ్యూటేషన్, రికార్డు దోషాల సవరణ, వారసత్వ నమోదు తదితర సేవలు సక్రమంగా అందించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి ప్రసంగిస్తూ డ్రోన్లు, డీజీపీఎస్, కోర్స్ టెక్నాలజీ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో కచ్చితమైన సర్వే నిర్వహించి అర్హులకు రాజముద్రతో కూడిన భూ పట్టాలను జారీ చేయాలన్నారు.
ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలకు 342 మంది గైర్హాజరు


