రాష్ట్రంలో కోవిడ్‌ ఆసుపత్రులు పెంపు

CM YS Jagan Mohan Reddy Held Meeting On Covid-19 With Officials   - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ,  కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.

ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలని, నిరంతరం ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని చెప్పారు.  కాల్‌ సెంటర్‌లతో పాటు ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. 

ఇంకా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ’ చికిత్స తీసుకుంటున్నవారికి మంచి భోజనం అందించాలి, హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలి. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలి. మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలి. రిఫరల్‌ ప్రోటోకాల్‌ చాలా స్పష్టంగా ఉండాలి. విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి ఈ ప్రోటోకాల్‌ అమలు జరగాలి. ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకునేందకు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్‌సెంటర్‌ ఉండాలి. ఈనంబర్‌ను అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుపై ఉంచాలి. పేషెంట్‌ను ట్రీట్‌చేయకుండానే అవసరంలేకుండా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గట్టిగా చెప్పాలి. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు ఎలా జరుగుతుందో పరిశీలించాలి. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అక్కౌంట్లో పడాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. 

చదవండి: వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top