చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం: సీఎం జగన్‌

CM YS Jagan Launches Third Installment Of Jagananna Thodu Scheme - Sakshi

సాక్షి, తాడేపల్లి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అ‍న్నారు.

పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. 

గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం
పూర్తి వడ్డీ  భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందజేస్తోందని తెలిపారు. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

పేదలను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది
కోవిడ్‌ కారణం చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. నిరుపేదల కుటుంబాలను కాపాడేందుకు సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. అవినీతికి తావులేకుండా పేదలకు రూ. 1.29 లక్షల కోట్లు అందించామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కంటే పేదలను మన రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుందని అన్నారు.  

ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్‌ 25న ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top