ఆ మూడింటితో అప్రమత్తంగా ఉండాలి | CM YS Jagan Comments On ABN Andhra Jyothi Eenadu And TV5 | Sakshi
Sakshi News home page

ఆ మూడింటితో అప్రమత్తంగా ఉండాలి

Aug 26 2021 5:03 AM | Updated on Aug 26 2021 9:34 AM

CM YS Jagan Comments On ABN Andhra Jyothi Eenadu And TV5 - Sakshi

సాక్షి, అమరావతి: స్వప్రయోజనాలు తప్ప ఏమీ పట్టని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆ మూడింటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నప్పటికీ కొంతమంది స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని, అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కోసారి బాధనిపిస్తోందని చెప్పారు. స్పందనలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలు, వాటిపై దుష్ప్రచారాలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

వారికి సొంత ప్రయోజనాలు తప్ప ఏమీ పట్టవు
ఇటీవల రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా కూడా స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై బురద చల్లాలని ఆరాటపడే వ్యవస్థను మనం చూస్తున్నాం. వారి స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కోసారి బాధనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాల గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఒక ఈవ్‌టీజింగ్‌ కేసులో కానిస్టేబుల్‌ సస్పెండ్‌ అయ్యాడు.

ఆ కేసులో అమ్మాయి, ఆ కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతినేలా, వారికి కళంకం తెచ్చేలా ఆ కేసుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన తీరు, మీడియాతో మాట్లాడిన విధానం ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పెట్టేలా ఉన్నాయి. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సంఘటనల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్వప్రయోజనాలకోసం ఒక వర్గం మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారంపైన కూడా మనం పోరాటం చేస్తున్నాం. మనం వాస్తవానికి రాజకీయ పార్టీలతో యుద్ధం చేయడం లేదు.

మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నాం. ఈ వ్యక్తులకి వాళ్ల సొంత ప్రయోజనాలు తప్ప మరే అంశాలు పట్టవు. వాళ్లనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ఎవరిమీదనైనా వీళ్లు బురద చల్లుతారు. అందుకోసం మిమ్మల్ని కూడా మినహాయించరు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోండి. మన చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తం కావాలి. ఎలాంటి వక్రీకరణకు తావివ్వకూడదు. మీరు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు, ఎంత మంచిగా పనిచేస్తున్నారన్నది ఆ వర్గం మీడియాకు అవసరం లేదు. స్వార్థ ప్రయోజనాలే వారి లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా పనిచేయాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement