రైలు ప్రమాదంలో ఏపీ బాధితులకు పరిహారం | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో ఏపీ బాధితులకు పరిహారం

Published Mon, Jun 5 2023 4:01 AM

CM YS Jagan Announced exgratia for AP People in Odisha train accident - Sakshi

సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన బాధితులందరికీ పరిహారం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం అధికారులతో సమీక్షించారు.

రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను, విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణించి ఉంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి ఇది అదనం అని స్పష్టం చేశారు.

బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మరణించారని, ఇది తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారికి మంచి వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement