జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది: సీఎం జగన్‌

Cm Jagan Review On Panchayat Raj And Rural Development - Sakshi

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష

సాక్షి, తాడేపల్లి: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్‌ ప్రాంతాల్లో కూడా డిజిటల్‌ లైబ్రరీలను తీసుకురావాలన్నారు.

చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు.
చదవండి: విశాఖలో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను  నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోంది.  అలాగే గ్రామ సచివాలయాల్లో  రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు.  అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top