వరి పండించిన పంజాబ్ క్యాన్సర్ బారిన పడింది
రోజు రెండు బస్సుల్లో పంజాబ్ రైతులు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్లుగా వెళ్తున్నారు
టెక్నాలజీని నేనే తీసుకొచ్చా
ఇంజినీరింగ్ కాలేజీలను కూడా నేనే తెచ్చా
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్నా
ఎంఎస్‌ఎంఈ పార్కుశంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ అమరావతి: వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని, వరి పండించటం వల్లే పంజాబ్ రైతులకు క్యాన్సర్ సోకిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపనకు చంద్రబాబు హాజరయ్యారు. ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కర్నూలు, అచ్యుతాపురం, గుంటూరు జిల్లా శాఖమూరులో దసపల్లా స్టార్ హోటల్ సహా రాష్ట్రవ్యాప్తంగా 49 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్నారు. ప్రతిరోజు పంజాబ్ నుంచి రెండు బస్సుల్లో ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రులకు వెళుతున్నారని చెప్పారు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కాకి లెక్కలతో గొప్పలు
సీఎం చంద్రబాబు ప్రసంగం కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టేలా సాగింది. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన లెక్కలు చెబుతూ తడబడ్డారు. నిధులు అని చెప్పబోయి సంస్థలు అని చెప్పారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పి.. 87 ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో ఉన్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 75 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశామని చెప్పుకొచ్చారు.
ఏపీఐఐసీలో ఇప్పటివరకు 25 ఇంజినీరింగ్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఆ వెంటనే 1,595 ఎంఎస్‌ఎంఈలకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. మళ్లీ ఈ వారంలో 99 కంపెనీలకు శంకుస్థాపన చేశామన్నారు. చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలకు ఒక దానితో ఒకటి పొంతన లేకపోవడంతో జనాలకు అర్థంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, ఉపాధి అని అంకెల గారడీ చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం చేస్తానని గొప్పలు పోయారు.
సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే.. నన్ను 420 అన్నారు
30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు టెక్నాలజీని తానే తెచ్చానని, దీనివల్లే హైదరాబాద్‌కు దేశంలోనే అత్యధికంగా తలసరి ఆదాయం వస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే తనను కొందరు 420 అన్నారని.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలను తానే తెచ్చానని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని కూడా తానే తీసుకొస్తున్నానని, భవిష్యత్ మొత్తం టెక్నాలజీదేనని గొప్పలు వల్లెవేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అర్థం కావట్లేదు
తనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సుపరిపాలన తెస్తానని చెప్పినట్టుగానే ఏ పని కావాలన్నా సెల్ ఫోన్‌లో అయిపోయేలా చేశా. ఏఐ పెడుతున్నాం.
మీ ఇంటి పక్కనే ఉండే ఎమ్మార్వో ఆఫీసులో పని కూడా ఇంట్లో ఉంటే అయిపోయేలా టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. అన్ని విషయాల్లో ఐవీఆర్‌ఎస్ ద్వారా మిమ్మల్నే అడుగుతున్నా. ఇంటికి వచ్చే గ్యాస్ ఇచ్చి బాయ్ ప్రవర్తన బాగుందా? లేదా? బాయ్ డబ్బులు అడుగుతున్నాడా అని కూడా అడుగుతున్నా. ఏ చిన్న పని అయినా ప్రజలను అడిగి మీరు శభాష్ అన్నాకే అది చేస్తున్నా. లేదంటే పక్కన పెడుతున్నా’ అని చంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్ బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే..
‘బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అనేలా నేనే ప్రమోట్ చేశా. ప్రపంచానికి పరిచయం చేశా. దూరదృష్టితోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీ పక్కన విమానాశ్రయం కట్టాను. అవుటర్ రింగ్ రోడ్డుతో అక్కడి లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్ అభివృద్ధికి కష్టపడ్డా. అవుటర్ రింగ్‌రోడ్డు, ఫార్మా, హైటెక్ ఐటీ ఇలా హైదరాబాద్‌లో అన్నీ నేనే చేశా. హైదరాబాద్‌లో ఐటీతో ప్రారంభించా. ఏపీలో గూగుల్‌తో ప్రారంభించా.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ 18 నెలల పాలనలో పెట్టుబడుల వరద వస్తోంది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. విశాఖ సీఐఐ సదస్సులో మరో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అబ్దుల్ హక్ అవార్డులతోపాటు ఉర్దూ భాషాభివృది్ధకి పాటుపడుతున్న సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం 139 మందికి అవార్డులు అందించారు.


