సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వర్మకు సీఎం చంద్రబాబు షాకిచ్చారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్ పేరుతో తన్నుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే జనసేన నేతలు వర్మపై దాడి చేస్తే.. చంద్రబాబు క్లాస్ పీకడంపై వర్మ అనుచరులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిఠాపురం పంచాయితీ చంద్రబాబుకు తలనొప్పిగా మారినట్లైంది.
కడుపులో కత్తులు
చంద్రబాబు సారథ్యంలో జత కట్టిన టీడీపీ, జనసేన నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. పైకి పొత్తులంటూనే కత్తులు దూసుకుంటున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు.
తాజాగా పట్టణంలోని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయం వద్ద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీ, బ్యానర్లపై కూడా చంద్ర బాబు ఫొటో పెట్టకపోవడంపై టీడీపీ చూజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు.
ఈ క్రమంలో ఆయనను జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నెట్టేసీ ప్రయత్నం చేశారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య ఆరుపులు, కేకలతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు బాహాబాహీకి దిగాయి. ఈసారి వర్మపై జనసేన వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దోర బాబు దూకుడు ప్రదర్శించడం చూస్తూంటే వారిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరిందని చెప్పుకొంటున్నారు.

పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఫొటోకు ప్రాధాన్యం ఇచ్చినా చంద్రబాబు ఫొటో కూడా పెడుతున్నామన్నది జనసేన నేతల వాదనగా ఉంది. ఏదో ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వర్మ తరచూ రాద్దాంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
నియోజకవర్గం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది వర్మతో పాటు టీడీపీ నేతలు డిమాండ్‌గా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కావాలనే చంద్రబాబు ఫొటో పెట్టకుండా అవమానిస్తున్నారనేది వర్మ వాదన. ఒకటీ రెండు కాదు నాలుగైదు. పర్యాయాలుగా ఇలానే ఆవమానిస్తున్నారని, దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఈ సంఘటన మీదే ఆయన అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు.


