చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకు డీజీపీ లీగల్‌ నోటీసులు

Chandrababu, Ramoji Rao, Radha Krishna Were Sent Legal Notices In Vijayawada False propaganda Drugs Affair - Sakshi

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా

డ్రగ్స్‌పై నిరాధార ఆరోపణలు, కథనాలు

క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవు 

సాక్షి, అమరావతి: కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతోపాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లీగల్‌ నోటీసులు జారీ చేశారు. 

నిరాధార ఆరోపణలతో కథనాలు..
‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ రవాణా– గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్‌ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌తోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆమోద పబ్లికేషన్స్, ప్రింటర్‌–పబ్లిషర్‌ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌లకు డీజీపీ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసరెడ్డి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. 

దురుద్దేశపూర్వకంగానే..
డీఆర్‌ఐ గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని డీఆర్‌ఐ ప్రకటించినా, డీజీపీ కూడా స్పష్టత ఇచ్చినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ నిరాధార ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.   
చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top