చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ వాయిదా | Chandrababu Quash Petition Updates: SC Bench Adjourn Oct 13 | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ శుక్రవారానికి వాయిదా

Oct 10 2023 2:25 PM | Updated on Oct 10 2023 3:22 PM

Chandrababu Quash Petition Updates: SC Bench Adjourn Oct 13 - Sakshi

సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు..

సాక్షి, ఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన  క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. శుక్రవారానికి(13వ తేదీ) మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

చంద్రబాబు తరపున హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు.  సీఐడీ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ‘‘17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదు. నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమే. చంద్రబాబుకు 17ఏ వర్తించదని’’ ముకుల్‌ రోహత్గీ వాదించారు.

యశ్వంత్‌ సిన్హా కేసును ప్రస్తావన..
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు.  రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్‌ కేసులో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్‌ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్‌ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్‌ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఎతో రక్షణ లభించింది’’అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్‌ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు.  స్పందించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. 

చంద్రబాబుకి వర్తించదు: రోహత్గీ
2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. ‘‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్‌ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్‌ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి.

చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు. 2014-15 మధ్య ఈ స్కాం జరిగింది. 2018 లో 17A రాకముందే నేరం జరిగింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు. 2021లోనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినా, 2023లో బాబు అరెస్ట్ జరిగింది. జిఎస్టీ పుణె ఫిర్యాదు ఆధారంగా కేసు ప్రారంభమైంది. దీని రిఫరెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. 17-A తెచ్చింది నిందితుల రక్షణ కోసం కాదు, నిజాయితీ కల అధికారుల రక్షణ కోసమే. 17-A గొడుగు కింద అవినీతి పరులు తప్పించుకోలేరు, నిజాయితీ పరులకు ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ విధుల్లో దుర్వినియోగం చేశారా ? లేదా అన్నది విచారణలోనే తేలుతుంది ’’ అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. 

ఈ క్రమంలో వాదనలు సుదీర్ఘంగా కొనసాగగా.. సమయం సరిపోదని, మిగతా వాదనలు వచ్చే విచారణలో వింటామని తెలిపింది. ఇక.. తదుపరి విచారణకు హరీష్‌ సాల్వే వర్చువల్‌గా హాజరు కానున్నట్లు తెలిపారు.

సాక్షి వాట్సాప్‌ ఛానెల్‌తో ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement