బి.కొత్తకోట: చంద్రబాబు తంబళ్లపల్లె టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం రండి రండి అని పలుకుతూనే.. వద్దు వద్దు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితిపై తంబళ్లపల్లె టీడీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో అప్పటి టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి పార్టీకి ఇన్‌చార్జి లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల క్రితం అమరావతికి శంకర్‌ను, పార్టీ మండల అధ్యక్షులను చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన నివాసంలో సమావేశం నిర్ణయించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు, వెళ్లిపోండి అని సమాచారం అందడంతో వెళ్లిన వారంతా నిరుత్సాహంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది.
శనివారం సాయంత్రం శంకర్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆదివారం ఉదయం అమరావతి రావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆహ్వానం వస్తుందా అని కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు ఈ పిలుపు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించింది. అప్పటికప్పుడు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే మళ్లీ కబురొచ్చింది. వద్దు వద్దు మీరు రాకండి.. మళ్లీ ఎప్పుడు వచ్చేది చెబుతామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం గంటల్లోనే నీరుగారిపోయింది


