ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీపై బాబు మొండి వైఖరి
కారుచౌకగా కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థలకు మరో నజరానా
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కోసం కసరత్తు
వీజీఎఫ్ కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన చంద్రబాబు సర్కారు
ఇప్పటికే అనేక ప్రయోజనాలు చేకూర్చిన ప్రభుత్వం
అయినా పీపీపీ కోసం ముందుకురాని సంస్థలు
అదనపు మేలు చేకూర్చేందుకు సర్కారు సమాయత్తం
వీజీఎఫ్ కింద ప్రాజెక్ట్ వ్యయంలో 30 శాతం మేర భరించనున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటుపరం(పీపీపీ)పై చంద్రబాబు సర్కారు మొండి వైఖరి వీడడం లేదు. కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ముందుకెళుతోంది. దీనికోసం అనేక ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం... పీపీపీకి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపకపోవడంతో మరో కుట్రకు తెరతీసింది. అదనపు మేలు చేకూర్చేందుకూ సిద్ధమైంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఖజానాపై అదనపు భారం వేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఎన్నో ప్రయోజనాలు
‘ఎకరం భూమికి ఏడాదికి రూ.100 లీజు చెల్లిస్తే చాలు. బోధనాస్పత్రుల్లో 70 శాతం ఇన్‌పేషెంట్ పడకలకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు సమకూరుస్తాం. మిగిలిన
30 శాతం పడకల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా ఫీజులు గుంజుకునే వీలు. సగం ఎంబీబీఎస్ సీట్లకు యాజమాన్య కోటా కింద ఫీజులు వసూలు చేసుకోవచ్చు. వైద్య కళాశాల, బోధనాస్పత్రిపై 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కుల కల్పన. రెండేళ్లపాటు బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాల చెల్లింపు’ అంటూ ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీకి ఇవ్వడం కోసం చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ సంస్థలకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది.
అయినప్పటికీ కళాశాలలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదనే సాకుతో మరో భారీ నజరానా ఇవ్వడానికి చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. కళాశాలలు పూర్తి చేయడానికి అవసరమయ్యే వ్యయంలో 30 శాతం మేర వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీజీఎఫ్ రూపంలో ప్రైవేట్ సంస్థలకు మరింత మేలు తలపెట్టబోతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పెనుకొండ వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. గతేడాది టెండర్‌లు పిలిచి రద్దు చేసిన ఆదోని, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ
ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని సమాచారం.
ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రే!
గత ప్రభుత్వం భూములు సేకరించి, రూ.వేల కోట్ల ప్రజాధనంతో నిర్మాణాలు ప్రారంభించి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను బాబు సర్కారు పీపీపీ ముసుగులో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు తెగతాపత్రయపడుతోంది. బాబు సర్కారు తొలి దశలోనే పీపీపీకి ఇవ్వాలనుకున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు ప్లగ్ అండ్ ప్లే తరహాలో 2024 ఎన్నికల నాటికే ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పులివెందుల కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) సైతం పచ్చ జెండా ఊపింది.
అయితే కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాసి ఆ కళాశాల అనుమతులు, సీట్లను రద్దు చేయించింది. ఈ తరహా కళాశాలలను కారుచౌకగా కట్టబెట్టేయడం కోసం ప్రైవేట్‌కు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంది. అంతటితో ఆగకుండా వీజీఎఫ్ కింద ప్రైవేట్ వ్యక్తులు భరించాల్సిన వ్యయంలో 30శాతం మేర నిధులు ఖజానా నుంచి సమకూర్చడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.
వాస్తవానికి ప్రైవేట్ సంస్థలు భారీగా సొంత పెట్టుబడి పెట్టి రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక వసతులు నిర్మిస్తున్నప్పుడు, వారికి ఆశించిన లాభాలు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఓ ఆర్థిక మద్దతు వీజీఎఫ్. ఇదిలా ఉంటే పీపీపీ వైద్య కళాశాలలకు ఇప్పటికే భారీ ఎత్తున అయాచిత ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం సమకూర్చింది. ఇక ప్రైవేట్ సంస్థకు వచ్చే నష్టం ఎక్కడ ఉంది? వారు భరించే రిస్క్ ఏమిటి? వీజీఎఫ్ రూపంలో చేస్తున్న అదనపు లాభం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రలో భాగంగానే పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
విద్యార్థులకు తీరని ద్రోహం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు మన రాష్ట్ర విద్యార్థులకు రెండేళ్లలో తీరని ద్రోహం తలపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. వాటిలో 10 ప్రైవేట్‌కు కట్టబెట్టాలని గద్దెనెక్కిన వెంటనే బాబు నిర్ణయించారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్నే రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీనిచ్చింది.
అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. గద్దెనెక్కాక విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా ఎత్తేయకపోగా, ఏకంగా ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. ఈ నిర్ణయంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. రేయింబవళ్లు శ్రమించి నీట్‌లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల వైద్య విద్య కలను బాబు కాలరాశారు.


