జగన్‌ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్‌’    | Chandrababu Naidu has not sanctioned a single house in 17 months | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్‌’   

Nov 13 2025 5:24 AM | Updated on Nov 13 2025 7:15 AM

Chandrababu Naidu has not sanctioned a single house in 17 months

పేదలందరికీ స్థలాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ 

17 నెలల్లో గజం స్థలం, ఒక్క ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు 

నాడు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31.19 లక్షల పేదింటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలిచ్చిన వైఎస్‌ జగన్‌.. వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు 

వీటికి 2.60 లక్షల టిడ్కో ఇళ్లు అదనం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి 

దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరో రెండు లక్షలకు పైగా ఇళ్లు... మిగిలినవి వివిధ దశల్లో.. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో నిర్మించిన వాటిలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ 

గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు స్టేజ్‌ అప్‌డేట్‌ చేసి 3 లక్షల ఇళ్లు కట్టేశామని చంద్రబాబు గొప్పలు 

ఆఖరికి సీఎం చంద్రబాబు నుంచి తాళాలు అందుకున్న వారికి ఇళ్లు మంజూరైంది జగన్‌ ప్రభుత్వంలోనే.. 

ఆ స్థలాలు శవాలు పూడ్చడానికి సరిపోతాయని పేదల మనోభావాల మీద దెబ్బ కొట్టిన బాబు.. 

నేడు అవే ఇళ్లను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడానికి వెంపర్లాడుతున్న సీఎం

నాడు
‘‘సెంటు స్థలం ఇస్తారంట..! ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది...? ఒక్కదానికి సరిపోతుంది. చనిపోయిన తర్వాత పూడ్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది. అంతకుమించి ఇళ్లు కట్టడానికి పనికిరాదు. – వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబు

నేడు
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్‌.అల్తాబ్‌బేగమ్‌ వ్యవసాయ కూలీ. ఈమె పేరిట గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నవ రత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్‌లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై రూ.32 వేల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి సమకూర్చింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే, కేవలం తాళంచెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్‌ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు. అల్తాబ్‌బేగమ్‌ మాత్రమే కాదు, బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడిపల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి మల్లక్కలకూ 2021–22లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసింది. 

ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.

సాక్షి, అమరావతి: ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైనా పంచిన దాఖలాల్లేవు.. పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన పాపాన పోలేదు... కానీ, తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు నిర్మించేసిందని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. అన్నింటిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు క్రెడిట్‌ కొట్టేస్తున్న సీఎం చంద్రబాబు... ఇప్పుడు పేదలకు  ఇళ్లు కట్టించేశామంటూ నిస్సిగ్గుగా డప్పు కొట్టుకుంటున్నారు. 

ఈ మేరకు ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఆర్భా­టం చేశారు. ఇదంతా చూసి ప్రజలు అవాక్కవు­తు­న్నారు. చంద్రబాబు మూడు లక్షల ఇళ్ల కథ కమామిషు ఏమిటి? అని చూస్తే అసలు విషయం బయటపడుతోంది. పాలనలో విఫలమైన బాబు పేదలకు తాను చేయని మేలును చేసినట్టు మభ్యపెడుతున్న కుతంత్రం బయటపడుతోంది.

గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లే
రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండగా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. వీటి మార్కెట్‌ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్దఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు. 

అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఇళ్లు 2.62 లక్షలు అదనం. ఎన్నికలు ముగిసేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు శ్లాబ్‌ పూర్తయిన, 99 వేల ఇళ్లు శ్లాబ్‌ దశలో ఉన్నాయి. చాలావరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో స్టేజ్‌ అప్‌డేట్‌ చేయని పరిస్థితి. 

ఇలాంటి ఇళ్లకు స్టేజ్‌ అప్‌డేట్‌ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్‌ ప్రచారం చేసుకుంటోంది. బుధవారం చంద్రబాబు దేవగుడిపల్లెలో పంపిణీ చేసిన ఇళ్లు సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించినవే. అక్కడి రాజీవ్‌ కాలనీలో ఇళ్లు లేని పేదలకు 40 ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చింది. 30 మంది లబ్ధిదా­రులు నిర్మాణం మొదలుపెట్టగా, ఎన్నికలు ముగిసేనాటికే కొన్ని పూర్తయ్యాయి. మిగిలినవి దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్న దశలో ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించిన ఇళ్ల తాళాలను సీఎం, మంత్రులు లబ్ధిదారుల చేతుల్లో పెట్టడం గమనార్హం.

పూర్తి అండగా వైఎస్‌ జగన్‌
2019–24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్‌ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మందిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్‌ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. 

ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు కరెంట్, విద్యుత్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు రూ.355 కోట్ల దాక ఖర్చు చేశారు. 

ఐదేళ్లలో ఇళ్ల పట్టాలకు భూ సేకరణ, లేఅవుట్‌ల అభివద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు రూ.35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సృష్టికి పాటుపడ్డారు.

బాబు పాలనలో గజం స్థలమైనా మిథ్య!
17 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవీ రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. 

పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమరావతిలో 50 వేలమంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. 

సాయం పెంపులోనూ మొండిచేయి
పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ, గజం కూడా ఇచ్చింది లేదు. 2019లో వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చాక 6 నెలల్లోనే కోవిడ్‌ వ్యాప్తి మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. 

ఈ పరిస్థితులను అధిగమించి 2020 డిసెంబరు 25న వైఎస్‌ జగన్‌ 31 లక్షల మందిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి చరిత్ర సష్టించారు. కాగా, ఈ స్థలాలు శవాలు పూడ్చడానికి తప్ప దేనికీ పనికిరాదని పేదల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. నాడు శ్మశానాలతో పోల్చిన స్థలాల్లోని ఇళ్లనే నేడు తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.

చంద్రబాబు కనీసం ఇళ్ల పట్టాల పంపిణీలో విఫలమయ్యారు. పేదలకు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేయడమే కాక సీఎం హోదాలోనూ దగా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనే పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదనపు సాయం వస్తుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. కొద్ది రోజులకే ఆ సాయం ఊసే లేకుండా చేసేశారు.

1,43,600 మంది నిరుపేదలకు  ఉచితంగానే టిడ్కో ఇళ్లు
మిగిలినవారికి లబ్ధిదారుల వాటా 50 శాతం తగ్గింపు
లక్షమంది లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగింత
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని, ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందన్న ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్నిచోట్ల పునాదులతో వదిలేయగా, చాలాచోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరు, రెండు–మూడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. 

కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో, 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 

గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్‌ ధరలను పక్కనబెట్టి, 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, మరో 77 వేల ఇళ్లను 90 శాతంపైగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తి చేసింది.

300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లను ఉచితంగా ఇవ్వగా రూ.10,339 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వీరి నుంచి గత టీడీపీ సర్కారు లబ్ధిదారుల వాటాగా వసూలు చేసిన రూ.500 కోట్లను తిరిగి చెల్లింపు ప్రారంభించి రూ.250 కోట్లను వెనక్కిచ్చింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాలని నిబంధన పెట్టింది. వైఎస్సార్‌సీపీ సర్కారు దీన్ని 50 శాతం తగ్గించింది. 

ఈ రెండు యూనిట్లకు గాను 1,18,616 మంది పేదలపై రూ.482 కోట్ల భారం తగ్గింది. పైగా లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1,77,546 ఇళ్లు పూర్తి చేసిందని అసెంబ్లీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ సైతం ప్రకటించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement