సాయం మరిచి.. వెన్నువిరిచి!: ధాన్యం.. దళారీదే రాజ్యం..
వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం
దళారుల చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీ వ్యవస్థలు
పంట ఎంత బాగున్నా ధర, ధాన్యంలో అడ్డగోలుగా కోతలు
75 కిలోల బస్తాకు ఏకంగా రూ.400 వరకు తగ్గింపు
ఎకరానికి రూ. 6 వేలు–7 వేలు నష్టపోతున్న అన్నదాతలు
ధాన్యం లోడింగ్, మిల్లుకు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసిన సర్కార్
ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకురాని వాహన యజమానులు
మిల్లులో తేమ శాతం పేరుతో మోసగిస్తున్నా వేడుక చూస్తున్న ప్రభుత్వం
ఈ–క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యంతో కౌలు రైతులకు దగా
‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ధాన్యం కొనుగోళ్ల దందా
ధాన్యం కొనుగోళ్లతో పాటు ‘జీఎల్‌టీ’ కింద ఎకరాకు
రూ.పది వేలు చొప్పున నేరుగా రైతన్నల ఖాతాల్లోకి
జమ చేసి ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్
వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం
‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ధాన్యం కొనుగోళ్ల దందా
సాక్షి, అమరావతి: తుపాన్లు, వర్షాలు అన్నదాతలను ముంచేస్తే.. చంద్రబాబు సర్కారు వారి పొట్టగొడుతూ ఏడిపిస్తోంది! ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నలను దగా చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో దళారీల దందా కొనసాగుతోంది. పంట కోసి రోజుల తరబడి ఆరబెట్టినా తేమ శాతం తగ్గలేదని కుటిల సాకులు చెబుతూ నిలువు దోపిడీకి గురి చేస్తోంది! ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు(ఆర్బీకేలు, సొసైటీలు) ఎక్కడికక్కడ అధికారపార్టీ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయి. ఫలితంగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. దళారీని దాటుకుని వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అయినకాడికి విక్రయించి మౌనంగా కుమిలిపోతున్నారు. ఇది రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో ఇది పరిమితం కాలేదు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని నున్న, సూరంపల్లి, మేదరపాలెం, ముస్తాబాద, ఉప్పులూరు, కంకిపాడు, చలివేంద్రపాలెం, మూర్తురాజుపాలెంతోపాటు మచిలీపట్నం హైవే, కాకినాడ, చింతలపూడిలో సోమవారం ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల అగచాట్లు, దయనీయ దృశ్యాలు కళ్లకు కట్టాయి.
ఎకరాకు రూ.6 వేలు – రూ.7 వేలు నష్టం
‘రైతే రాజు’ నినాదాన్ని చంద్రబాబు సర్కార్ మార్చేసింది. మిల్లరే ‘మహారాజు’ అన్న చందంగా వ్యవస్థను దిగజార్చింది. మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. పైగా మిల్లర్లు, దళారుల దందాకు గేట్లు తెరిచి కనీవినీ ఎరుగని రీతిలో మద్దతు ధర దోపిడీకి బీజం వేసింది. ధాన్యం సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్‌కు రూ.1,792 చొప్పున మద్దతు ధర కల్పించాలి. అయితే వారాల తరబడి పంటలను ఆరబెట్టినా రైతులకు 75 కిలోల బస్తాకు రూ.400 వరకు కోత పడుతోంది. ఇదే తుపాను సమయంలో అయితే ఏకంగా రూ.500 వరకు కోత విధించారు. రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మభ్యపెడుతోంది. చివరికి రైతు విసిగి వేసారి దళారీని ఆశ్రయించేలా పరోక్షంగా దోపిడీకి సహకరిస్తోంది. దీంతో రైతన్నలు ఎకరానికి సుమారు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ–క్రాప్ నమోదు సక్రమంగా లేకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం మినహా గత్యంతరం లేకుండాపోయింది.
తేమ శాతంలో ఎంతో తేడా..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, సొసైటీల్లో వినియోగించే తేమ శాతం మిషన్ల లాంటివే మిల్లుల్లో కూడా పెట్టించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆర్బీకేలో రైతు ధాన్యం శాంపిళ్లు 17 శాతం లోపు తేమ చూపిస్తుంటే, అదే ధాన్యం మిల్లుకు చేరేసరికి 21 శాతానికి పెరిగిపోతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అనేది ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ఫలితంగా ఒక్కో పాయింట్‌కు కేజీ చొప్పున ధాన్యాన్ని కోత వేస్తున్నారు. లేదంటే తరుగుకు డబ్బులు సమర్పించుకోవాల్సిందే. ఈ దందా యథేచ్ఛగా ప్రతి మిల్లులోనూ జరుగుతోంది. ఆర్బీకేలో వచ్చిన తేమ శాతాన్ని ఫైనల్‌గా గుర్తించాల్సి ఉండగా, మిల్లర్లు చెప్పిందే వేదం అవుతోంది. మిల్లుల్లో కస్టోడియన్ ఆఫీసర్లు కనీసం కంటికి కనపడటం లేదు. ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపిన తర్వాత రోజుల తరబడి తరలించకపోవడంతో శీతాకాలం మంచు ప్రభావం బస్తాలపై పడుతోంది. ఫలితంగా చెమ్మ చేరి, ధాన్యం రంగుమారి రైతులు నష్టపోతున్నారు. ఇక లక్షల మంది రైతులున్న మన రాష్ట్రంలో 50 వేల టార్పాలిన్లు ఇచి్చనట్లు ప్రభుత్వం చెబుతుండగా క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరికీ అందడంలేదు.
మిల్లులకు చేర్చే భారం రైతులపైనే!
ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఆర్బీకే సిబ్బంది షెడ్యూల్ ఇవ్వడం, శాంపిల్ పరీక్షించడం తూతూ మంత్రంగా మారింది. రైతే శాంపిళ్లు పట్టుకుని ఆర్బీకేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 7.50 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సంచుల కోసం ప్రాథేయపడేలా చేస్తోంది. ఇవన్నీ ఉంటే.. చివరకు లోడు ఎత్తడానికి వాహనాలు రావు. పేరుకు మాత్రమే ప్రభుత్వం 25 వేల రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసింది. కానీ, గతేడాది డబ్బులు చెల్లించకపోవడంతో ఏ ఒక్కరూ ముందుకు రావట్లేదు. ఫలితంగానే రైతులు మిల్లుకు సొంత ఖర్చుతో లోడు తరలించాల్సి వస్తోంది. మిల్లుల దగ్గర రెండు మూడు రోజుల వరకు దిగుమతి చేసుకోకపోవడంతో వెయిటింగ్ చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. ఒక బస్తాలో ధాన్యం నింపడానికి రూ.20, రవాణాకు టన్నుకు సుమారు రూ.300–రూ.400 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇంత నష్టపోతున్నా ప్రభుత్వం నుంచి జీఎల్‌టీ రావట్లేదు.
నేలకొరిగిన కష్టం..!
ఇటీవల తుపాన్లు, వర్షాల ధాటికి పంట చాలా వరకు నేలకొరిగింది. ఇప్పుడు పంట కోత తలకుమించిన భారంగా మారింది. గతేడాది ఎకరా వరి పొలం మిషన్లపై కోత కోసేందుకు రూ.2,500 వ్యయం అయితే ఈ ఏడాది రూ.3,600కు పెరిగింది. నేలకొరిగిన పైరును కోయడానికి సుమారు 3 గంటలు పడుతుంది. అంటే ఎకరా నేలకొరిగిన పంట కోతకు రైతన్నలు ఏకంగా రూ.10,800 చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా రైతులపై అదనపు భారం పెరిగిపోయింది. వాస్తవానికి విత్తు వేసిన దగ్గర నుంచి కోత కోసేవరకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. కానీ, తీరా పంట చేతికొచ్చాక మద్దతు ధరలో కోత పెట్టడంతో చేసిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
దేశంలోనే తొలిసారిగా వైఎస్ జగన్ హయాంలో..
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లతోపాటు దేశంలో తొలిసారిగా జీఎల్‌టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్) చార్జీల కింద ఎకరాకు రూ.పది వేలు చొప్పున నేరుగా రైతన్నల ఖాతాలో జమ చేసి ఆదుకోవడం గమనార్హం.
సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో విజయవాడను ఆనుకుని ఉన్న ఉప్పులూరు ప్రభుత్వ సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఓ దళారీ కబంధ హస్తాల్లో బందీగా మారింది. ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు రోడ్డుకు ఇరువైపులా రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతటి అసమర్థ పాలన కొనసాగుతోందో చెప్పేందుకు ఉప్పులూరి సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రమే నిదర్శనం! ‘‘మాకు కనీసం సంచులు ఇవ్వలేదు. పంట కోత కోసి రోడ్లపైనే వేశాం. వాళ్లు ఎప్పుడొస్తే అప్పుడే కాటా వేయాలి. ధాన్యం శుభ్రంగా ఎండినా ఇక్కడంతా దోపిడీనే. సొసైటీలో దళారీ ఎంత చెబితే అంతే! మిల్లులు కూడా వాళ్లవే. ఇక మాకు మద్దతు ధర ఎక్కడ దక్కుతుంది..?’’ అంటూ ఆ కేంద్ర వద్ద ఓ అన్నదాత ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మా పంట తేమ శాతాన్ని కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు. సొసైటీ దగ్గర 17 శాతం వస్తే మిల్లులో 21 శాతం చూపిస్తోంది. ఒక్కో పాయింట్‌కు కేజీ చొప్పున ధాన్యాన్ని అదనంగా లాగేస్తున్నారు. లేదంటే అంత తరుగుకు డబ్బులు కట్టాల్సిందే. ఈ ప్రభుత్వంలో అడిగేవాడు లేడు. పట్టించుకునే వాళ్లే ఉండరు. ప్రశ్నిస్తే మాపై కక్షగడతారు. పంట కొనకుండా ఇబ్బంది పెడతారు. అసలు ప్రభుత్వ సొసైటీలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఏమిటో? తరుగు రూపంలో నేను రూ.35 వేలు ముట్టచెప్పా. తుపాన్లు వచ్చి పంట పడిపోతే పరిహారం ఇవ్వని ఈ ప్రభుత్వం.. మద్దతు ధర కల్పిస్తుందనుకోవడం అత్యాశే..!’’ ఇదీ మరో రైతన్న గోడు.
ఎన్ని రోజులైనా ఎండబెట్టుకోవటమే!
35 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. త్వరగా కాటా వేస్తే రైతుకు దిగులు ఉండదు. అటు చేలల్లో పని చేసుకోవాలా? ఇటు వడ్లు రోజుల తరబడి ఆరబెట్టాలా? ఏ పని చేయాలి? ఆరబోసుకోవడానికి చోటు లేదు. వర్షాలు వస్తే కాపాడుకోవడానికి, మంచులో రాశులు తడిచిపోకుండా పట్టాలు కూడా ఇవ్వట్లేదు. మా ప్రాంతంలో వడ్లు కోసి పది రోజులు అయినా మిల్లుకు చేరట్లేదు. ఎన్ని రోజులైనా ఎండబెట్టుకోవడమే సరిపోతుంది. కాటా మాత్రం వేయట్లేదు. ప్రభుత్వం ఏమో కొనట్లేదు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తే రేటు కోసేస్తున్నారు. ఆర్బీకేలో గోనె సంచులు అడుగుతుంటే వడ్లు ఆరితేనే ఇస్తామంటున్నారు. పంట నేలకొరిగితే కనీస పరిహారం కూడా అందించలేదు. – కాసుల నాగేశ్వరరావు, మేదరపాలెం, విజయవాడ రూరల్ మండలం
రూ.1.10 లక్షలు నష్టపోయా..
తొలకరిలో నాలుగు ఎకరాలలో వరి సాగు చేశా. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఎకరాకు 30 బస్తాలే దిగుబడి
వచి్చంది. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయా. షావుకారుకు తక్కువ రేటుకు అమ్ముకున్నా. వర్షాలకు తడిసి రంగు మారిందనే నెపంతో రేటు కత్తిరించారు. దిగుబడి తగ్గడం, రేటు లేకపోవడంతో సుమారు రూ.1.10 లక్షలు నష్టపోయా. – యాళ్ల సత్తిబాబు, కాజులూరు, కాకినాడ జిల్లా
రైతుకు భరోసా దక్కట్లేదు
మా వద్ద కొనుగోలు కేంద్రమే పెట్టలేదు. ఊరు మొత్తం వ్యాపారస్తుల చేతుల్లోనే ఉంది. దళారీ చెప్పిందే రేటు. ధాన్యం ఆరబెట్టినా బస్తాకు (75 కిలోలు) రూ.300 కోత వేస్తున్నారు. తుపానుకు పంట నేలకొరిగితే నష్టపరిహారం అందలేదు. వడ్డీలకు కూడా సరిపోవట్లేదు. దళారులు, మిల్లర్లు బాగుపడటం మినహా రైతుకు ఎక్కడా భరోసా దక్కట్లేదు. - మహబూబ్ షరీఫ్, ముస్తాబాద, కృష్ణా జిల్లా
రేటులో కోత.. కిరాయి వాత!
మా పరిస్థితి దారుణంగా ఉంది. పంటకు గిట్టుబాటు లేదు. మిల్లరు చెప్పిన రేటుకే అమ్ముకున్నా. బస్తా లోడు చేసినందుకు రూ.20, ట్రాక్టర్ కిరాయి టన్నుకు రూ.300 వసూలు చేశారు. తుపాను దెబ్బకు నష్టపోయాం. మళ్లీ వాతావరణం మారితే సర్వం కోల్పోవాల్సిందే. ఆర్బీకే వాళ్లు ధాన్యాన్ని మిల్లుకు చేర్చాల్సిన బాధ్యత మాపైనే వదిలేశారు. – శ్రీనివాసరెడ్డి, చలివేంద్రపాలెం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
దళారుల ఇష్టారాజ్యం
ధాన్యం కొనుగోలులో వ్యాపారులు, దళారులదే ఇష్టారాజ్యం. తేమశాతం ఎక్కువగా ఉందనే సాకుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వెనక్కి పంపుతున్నారు. చేసేదిలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నాం. బస్తా రూ.400–రూ.500 నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోంది. – దొంతా కృష్ణ, రైతు, చింతలపూడి, ఏలూరు జిల్లా
అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు..!
మేం ఏ పంట వేయాలి? ఎంతకు అమ్ముకోవాలి? అన్నీ వాళ్లే నిర్ణయిస్తారా? అధికారంలో ఉంటే ఏమైనా చెల్లుతుందా? 20 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ధాన్యం మిల్లుకు తరలిస్తే తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. లారీ, కూలీలను మేమే పెట్టుకోవాలి. చేసేది లేక వ్యాపారికే అయినకాడికి ఇస్తున్నాం. ఆరబోస్తే కూలీల ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. ఎకరాకు 35–40 (40 కిలోలు) బస్తాలు దిగుబడి వస్తుంది. సార్వాలో పంట అమ్ముకోలేని పరిస్థితి. దాళ్వాకు వెళ్దామంటే పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేయొద్దని అంటున్నారు. అధికార పార్టీకి చెందినవారు శివారులోని వారి పొలాల కోసం మమ్మల్ని ఆరుదల (మొక్కజొన్న) పంట మాత్రమే వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ల పొలానికి నీళ్ల కోసం మమ్మల్ని ముంచేయాలని చూస్తున్నారు. గతంలో ఇలానే వాళ్ల మాటలు నమ్మి మొక్కజొన్న వేస్తే తూములు తెరవడంతో పొలంలో ఊట చేరి నష్టపోయాం. రైతులు అందరితో జనరల్‌బాడీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలంటే కుదరదట. వాళ్లు చెప్పిందే ఏకగ్రీవమని బెదిరిస్తున్నారు. – మల్లంపల్లి ఫ్రాన్సిస్, ముస్తాబాద, విజయవాడ రూరల్ మండలం


