అటకెక్కుతున్న బాబు కేసులు | Chandrababu Managing the systems for corruption cases against him | Sakshi
Sakshi News home page

అటకెక్కుతున్న బాబు కేసులు

Nov 20 2025 3:39 AM | Updated on Nov 20 2025 3:48 AM

Chandrababu Managing the systems for corruption cases against him

2014–19 మధ్య బరితెగించి అక్రమాలు

పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చిన సీఐడీ

ఆ అవినీతిని నిర్ధారించిన ‘కాగ్‌’ 

అన్ని కేసుల్లో చంద్రబాబే ప్రధాన నిందితుడు 

అధికారంలోకి రాగానే వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. అధికారులను బెదిరిస్తూ తనపై ఉన్న కేసులన్నీ నీరుగారుస్తున్న చంద్రబాబు

సాక్షులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాల కుతంత్రం 

అవినీతి కేసుల నుంచి బాబు పేరు తొలగించే పన్నాగం 

సీమెన్స్‌ కంపెనీ ముసుగులో స్కిల్‌ స్కామ్‌.. అమరావతిలో అసైన్డ్‌ భూదోపిడీ.. 

ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అవినీతి మెలికలు.. 

బినామీకి అడ్డగోలుగా ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్టు.. 

మద్యం దోపిడీ బ్రాండ్‌ అంబాసిడర్‌.. ఇసుకాసురుడు బాబే  

చంద్రబాబే కర్త, కర్మ, క్రియగా.. స్కిల్‌ స్కామ్, అసైన్డ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో సహా ఇప్పటికే నిగ్గు తేల్చింది. అన్ని కేసుల్లోనూ దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్లు కూడా దాఖలు చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై కేంద్ర సంస్థ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించినట్లు గుర్తించడంతో డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సైతం జప్తు చేసింది. 

చంద్రబాబు సన్నిహితులు, షెల్‌ కంపెనీల ప్రతినిధులు సుమన్‌ బోస్‌ తదితరులను అరెస్టు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కాగ్‌’ కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఖజానాకు గండి పడిందని నిర్ధారించింది. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. సాక్షులు, అధికారులను బెదిరిస్తూ తనపై నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు చంద్రబాబు తెర తీశారు. న్యాయస్థానం ఆదేశించిన విధంగా వివరణలతో చార్జ్‌షీట్లు దాఖలు చేయకుండా కేసులను అటకెక్కిస్తున్నారు. 

చంద్రబాబు ఒకవైపు తనపై ఉన్న కేసులను తొక్కిపెట్టి నీరుగారుస్తూ... మరోవైపు కాంగ్రెస్‌–టీడీపీ కుమ్మక్కు కుట్రలను కొనసాగిస్తూ ఎల్లో మీడియా ద్వారా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై విష ప్రచారాన్ని సాగిస్తున్నారు. గత నెలలో యూరప్‌ పర్యటనకు న్యాయమూర్తి అనుమతిస్తూ.. జగన్‌ తన లండన్‌ పర్యటన ముగిశాక కోర్టుకు హాజరు కావాలన్న సూచన మేరకు వైఎస్‌ జగన్‌ నేడు కోర్టుకు హాజరు కానున్నారు. 

స్కిల్‌ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్తున్న చంద్రబాబునాయుడు (ఫైల్‌) 

దీన్ని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వక్రీకరిస్తూ భారీగా దుష్ప్రచారానికి పాల్పడుతోంది. కేసుల విచారణలో భాగంగా ఆరేళ్ల తరువాత ఆయన కోర్టుకు వస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.  నిజానికి స్కిల్, లిక్కర్, ఫైబర్‌నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అసైన్డ్‌ భూ కుంభకోణం, ఇసుక కుంభకోణాలకు పాల్పడిందే చంద్రబాబు. అధికారాన్ని వినియోగించుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి వ్యవస్థలను మేనేజ్‌ చేçస్తున్నదే చంద్రబాబు.

సాక్షి, అమరావతి: భూ దోపిడీ, భారీ కుంభకోణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి పదవిని తన దోపిడీకి సాధనంగా చేసుకున్న చరిత్ర ఆయన సొంతం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో పచ్చ ముఠాలు సాగించిన దోపిడీలే అందుకు తార్కాణం. చంద్రబాబే కర్త, కర్మ, క్రియగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, అసైన్డ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. 

అన్ని కేసుల్లోనూ సీఐడీ చార్జ్‌షీట్లు కూడా దాఖలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుల దర్యాప్తును పక్కనపెట్టేసింది. న్యాయస్థానం కోరిన వివరణలతో చార్జ్‌షీట్‌ దాఖలు చేయకుండా కేసులను అటకెక్కించింది. గతంలో సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి వారితో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయిస్తోంది. అన్ని కేసుల్లోనూ చంద్రబాబు పేరును తొలగించేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పర్యవేక్షణలో డీజీపీ, సీఐడీ చీఫ్‌ తదితరులు చంద్రబాబుపై కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా కుట్రను తీవ్రతరం చేశారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు బరితెగించి సాగించిన కుంభకోణాలివిగో..!

సీమెన్స్‌ కంపెనీ ముసుగులో దోపిడీ షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా స్కిల్‌ కుంభకోణానికి తెర తీశారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సీమెన్స్‌ ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు ప్యాలస్‌కు తరలించారు. 


ఈ అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్‌ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్‌ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌( కాగ్‌) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది.  

మద్యం భూతం చంద్రబాబే! 
సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే బాబు 
మద్యం దందా డాన్‌ చంద్రబాబేనని రాష్ట్రంలో 2014–19 మధ్య సాగిన మద్యం దోపిడీ నిరూపిస్తోంది. తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్ల మేర ఆదాయానికి తూట్లు పొడిచారు. 


ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గతంలో టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది.  2014–19 టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉండటం గమనార్హం. 

2023లో డిస్టిలరీస్‌ ఎండ్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డి.వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఐఎస్‌ శ్రీనరేష్‌ తదితరులపై కేసు నమోదు సీఐడీ అధికారులు 

కేబినెట్‌ కళ్లుగప్పి.. 
2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ, కేబినెట్‌ ఆమోదం లేకుండానే చాపకింద నీరులా పన్నాగాన్ని అమలు చేశారు. చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ గుట్టుగా జీవో జారీ అయ్యింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే 
అనుమతులు ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు  2019–24 మద్య రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వ లేదు.

ఉచిత ఇసుక ముసుగులో దోపిడీ 
రూ.10 వేల కోట్లు కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్‌ 
2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు బరితెగించారు. కేంద్ర చట్టం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలనే కాదు రాష్ట్ర కేబినెట్‌ను కూడా చీకట్లో పెట్టి మరీ ఏకంగా రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్టు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబుతో­పాటు అప్పటి మంత్రులు దేవినేని ఉమామహేశ్వ­రరావు, పీతల సుజాత తదితరులపై కేసు నమోదు చేసింది. 

నాడు టీడీపీ అధికారంలోకి రాగానే  ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు కథ నడిపింది. అయితే ఈ విధానం ద్వారా ఆశించినంత దోపిడీ సాధ్యం కాదని గ్రహించడంతో రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్‌ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టి ‘ఉచిత ఇసుక విధానం’ దొడ్డిదారిన తెచ్చారు. టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్‌లను గుప్పిట పట్టి యథేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు.  

ఓటుకు కోట్లు రింగ్‌ మాస్టర్‌..  
రాష్ట్ర విభజన అనంతరం 2015లో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగదు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్ర­బాబు అక్రమాలకు పురిగొల్పారు. అందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా నామినేటెడ్‌ సభ్యుడు స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగించారు. సూట్‌కేసులో రూ.కోట్ల నగదును పంపారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడటం.. మావాళ్లు బ్రీఫ్డ్‌ మీ..! అని హామీ ఇవ్వడం ఆడియో వీడియో ఆధారాలతో సహా బట్టబయలైంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ  చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా తీవ్ర విభ్రాంతి వ్యక్తమైంది.

ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ మాస్టర్‌ మైండ్‌ బాబే 
బినామీ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టు 
అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్‌మైండ్‌ అనేందుకు ఫైబర్‌ నెట్‌ కుంభకోణమే తార్కాణం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ మరో అంకం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. 

ఈ స్కామ్‌లో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్, ఇన్‌క్యాప్‌ సంస్థల అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి)  ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది.   

బ్లాక్‌ లిస్టులో ఉన్న కంపెనీకి..! 
టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు. వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ–గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. 

ఎలాంటి సర్వే చేపట్టకుండానే సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమాంతం పెంచేశారు. ఈ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియ నాటికి టెరాసాఫ్ట్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ–పోస్‌ యంత్రాల సరఫరాలో విఫలం కావడంతో ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించి పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కకు తప్పించింది. అభ్యంతరాలను లెక్క చేయకుండా టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వారిని నియమించారు.  

అమరావతిలో అసైన్డ్‌ భూదోపిడీ 
రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం 
2014లో అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి వారి అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారు. రికార్డులు తారుమారుచేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేటు భూములను హస్తగతం చేసుకున్నారు. ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్‌ భూ దోపిడీ విభ్రాంతి కలిగిస్తోంది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్‌ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను బినామీల ద్వారా తొలుత హస్తగతం చేసుకున్నారు. 

అనంతరం అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో  చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్‌ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది.

 బాబు క్విడ్‌ ప్రోకో 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అవినీతి మెలికలు
రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం బరితెగించి సాగించిన భారీ అవినీతి దందాకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం మరో తార్కాణం. చంద్రబాబు, నారాయణ పక్కా పన్నాగంతో లింగమనేని రమేశ్‌తో కలసి క్విడ్‌ప్రోకో ద్వారా రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని సీఐడీ పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. ఈ కుంభకోణంలో నారా లోకేశ్‌ కూడా ప్రధాన పాత్ర పోషించారు. 


చంద్రబాబు బినామీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేష్‌ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను సవరించి ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో పవన్‌ కళ్యాణ్‌కూ పిడికెడు వాటా ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పి.నారాయణ, నారా లోకేశ్‌ను ఏ–14గా సీఐడీ పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1)(సి),(డి)ల కింద కేసులు నమోదు చేసింది.  

సింగపూర్‌ కన్సల్టెన్సీ ముసుగులో.. 
సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు బృందం ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టుగా భ్రమింపజేసింది. ఆ పేరుతో సింగపూర్‌ ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్‌ను తీసుకొచ్చి అవినీతి కథ నడిపించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కోసం సీఆర్‌డీయే అధికారులు 94 కి.మీ. పొడవుతో తొలుత అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఆ ప్రకారం చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి. 

అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని పసిగట్టిన చంద్రబాబు, నారాయణ సీఆర్‌డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్‌డీయే అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజలో చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. 

ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ సంస్థల పేరిట ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అటూ, ఇటూ భారీగా భూములు కొనుగోలు చేశారు. అనంతరం సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము సవరించిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement