సీఐఐ భాగస్వామ్య సదస్సులో డోలు వాయిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
విశాఖ: ‘సూర్యరశ్మిని మనం రాత్రిపూట కూడా అందించగలం. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అందించవచ్చు. దాన్ని కూడా మనం అంతరిక్షం నుంచి తీసుకుంటాం. కేవలం పగటిపూట మాత్రమే కాదు. రాత్రి సమయంలో కూడా మీకు సూర్యరశ్మిని ఇవ్వగలం. ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ నడుస్తోంది. ఇవన్నీ సాధ్యమేనని నేను మీకు హామీ ఇస్తున్నాను’ విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సులో గురువారం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడి ప్రతినిధులను నవ్వుకునేలా చేశాయి.
విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు.. అన్నీ తానే చేశానని తరచూ చెప్పడం మనందరికీ తెలిసిందే. అదే రేంజ్‌లో తనకు తానే ఎలివేషన్ ఇచ్చుకునేలా విశాఖ పెట్టుబడుల సదస్సులో ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. సౌర విద్యుత్ కోసం.. పగటిపూట మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా కావాల్సిన చోట సూర్యరశ్మిని అందిస్తామని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి రాత్రిపూట కూడా నేరుగా సూర్యరశ్మిని తీసుకొస్తానని చంద్రబాబు చెప్పడంపై సభలో పారిశ్రామికవేత్తలు తలలు పట్టుకున్నారు.
అంటే.. ఇకపై సూర్యుడికి సైతం రాత్రిపూట ఓవర్‌టైమ్ డ్యూటీ వేస్తారేమోనని నవ్వుకున్నారు. ఇకపై ప్రజలంతా రాత్రిళ్లు కూడా సూర్యరశ్మిని ఎంజాయ్ చేస్తారన్నమాట అంటూ జోకులేసుకున్నారు. కాగా.. ఏదో దేశంలో ఒక స్టార్టప్ కంపెనీ ఈ ప్రయోగం చేస్తుండటం చూసి చంద్రబాబు దానిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని గుసగుసలు వినిపించాయి.
ఇదీ కూడా చదవండి: ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా?


