ఏపీటీడీసీకి చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి!
లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కారు
అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర
చివరికి గిరిజన చట్టాలనూ కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఏజెన్సీలో టూరిజం హోటళ్లను సైతం ప్రైవేట్‌కు ఇచ్చేలా పావులు
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి సర్కారు
ఇసుక, మద్యం, రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ.. 108, 104 సేవలు నిర్వీర్యం
ప్రైవేట్‌కు ఏది కట్టబెట్టాలి..? ఎలా కట్టబెట్టాలి..? రాబట్టుకోవడం ఎలా..? ఇదే ధ్యాసలో టీడీపీ పెద్దలు
గిరిజన చట్టాలు తుంగలోకి...!
తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ముందుగానే ఆరు క్లస్టర్లకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)లను పిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను ధారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్సిలీహిల్స్ హోటల్‌ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకే ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌పీలో చేర్చలేదని సమాచారం.
మరోవైపు బయటి వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని ఐదు హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కారు కాలరాస్తుండటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చిమ): నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు.. నేడు టూరిజం శాఖ హోటళ్లు..! కొత్తగా సంపద సృష్టించకపోగా.. భావి తరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది! ప్రభుత్వ ఆస్తులను భద్రంగా పరిరక్షించాల్సింది పోయి.. ప్రైవేట్‌కు ఏది కట్టబెట్టాలి? ఎలా కట్టబెట్టాలి? రాబట్టుకోవడం ఎలా? అనే ధ్యాసలోనే టీడీపీ పెద్దలు ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది.
ఒకపక్క ఇసుక నుంచి మద్యం సిండికేట్ల దాకా పచ్చ ముఠాల దోపిడీని ప్రోత్సహిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతూ నీకింత.. నాకింత...! అనే రీతిలో దోపిడీ వ్యవహారాలకు తెర తీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా.. ప్రతిదీ ప్రైవేట్‌పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారు! ఇప్పటికే 108, 104 సేవలను నీరుగార్చేశారు.
రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటకశాఖ హోటళ్లపై కన్నేశారు! మంచి లాభాల్లో నడుస్తున్న హరిత హోటళ్లను తాము నిర్వహించలేమంటూ ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కారుచౌకగా దోచి పెడుతోంది! ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన హరిత హోటళ్లు, అనుబంధ ఆస్తులు ఒక్కటి కూడా లేకుండా చేయడంలో భాగంగా ఈ కుట్రకు తెర తీసింది.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతం అరకులోని హరిత హోటళ్లను సైతం ప్రైవేట్‌కే ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు (ఆర్‌ఎఫ్‌పీ) ఇప్పటికే ఆహా్వనించారు. బిడ్ల దాఖలు గడువు ఈ నెల (నవంబర్) 7తో ముగియగా, వాటిని ఓపెన్ చేసి టెక్నికల్ వ్యాల్యూయేషన్ చేయాల్సి ఉంది. టెండర్లలో అర్హత సాధిస్తే కేబినెట్‌లో పెట్టి ఆమోదించుకోవటమే మిగిలింది!
రూ.10 వేల కోట్ల ఆస్తి ప్రైవేటు పరం!
ఏపీటీడీసీ హోటళ్లను ఆరు క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటళ్లు ఉండగా మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లీజుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వార్షిక స్థూల ఆదాయం/ఏపీటీడీసీ నిర్ణయించిన సగటు వార్షిక లీజు రేటు ఆధారంగా రెండింటిలో ఏది ఎక్కువైతే అది ప్రైవేటు ఏజెన్సీలు చెల్లించాలని ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ సంస్థ తన ఆదాయాన్ని ఎంత వరకు కచ్చితత్వంతో వెల్లడిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రస్తుతం హోటళ్లు ఉన్న ప్రాంతంలో ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే మార్కెట్ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేటు ప్రకారం ఒక్క శాతాన్ని లీజుగా నిర్ణయించడం చూస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఉద్యోగుల కుటుంబాలు బలి..
ఏపీటీడీసీలో హోటళ్లు, వాటర్ ఫ్లీట్, ట్రాన్స్‌పోర్టు.. ఇలా వివిధ విభాగాల్లో సుమారు 1,300 మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఆప్కాస్, కన్సల్టెంట్లు, డైలీ వేజ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో రెగ్యులర్ ఉద్యోగులు డీవీఎంలు, మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయా హోటళ్లలో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలే తీసుకోవాలంటూ జీతభత్యాలు, ఉద్యోగ భద్రతను ప్రభుత్వం గాలిలో దీపంలా మార్చింది.
ప్రైవేట్ ఏజెన్సీలు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను కొనసాగించుకోవాలని, రెండు నెలలకు ఒకసారి వారి పనితీరును అంచనా వేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా లేకుంటే ఏపీటీడీసీ, ప్రైవేటు ఏజెన్సీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అంటే వారికి ఉద్యోగ భద్రత లేదని తేలిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగులను తీసుకుంటే డీవీఎంలుగా సేవలందిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పనిచేస్తారా? వారికి జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? అనే దానిపై స్పష్టత లేదు.
ప్రైవేట్ ఏజెన్సీల కింద పని చేయాల్సి వస్తే డీవీఎం కార్యాలయాలు, వాటికి అనుబంధంగా ఉండే సీఆర్‌వో కార్యాలయాలు మూతపడే అవకాశం లేకపోలేదు. తద్వారా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. హోటళ్లు ప్రైవేట్‌కు వెళ్లిపోవడం వల్ల ఇన్నాళ్లూ ప్రజలకు సేవలందిస్తున్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని డీవీఎం కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.
భారీగా రాబడి కోల్పోతున్న టూరిజం..
ఏపీటీడీసీ హోటళ్ల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో హోటళ్లను ఆధునికీకరించారు. దీనికోసం విజయవాడలోని బెరంపార్కు హోటల్‌తో పాటు ఇతర హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి జీజీహెచ్‌కు సమీపంలోని ఓ స్టేట్‌బ్యాంక్ నుంచి రూ.150 కోట్ల రుణానికి అనుమతులు పొందారు. ఇందులో రూ.100 కోట్లతో హోటళ్ల ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు.
తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తున్న అభివృద్ధి చేసిన హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ దర్శన టికెట్ల కోటాను రద్దు చేయడంతో ఏపీటీడీసీ ఏడాదికి రూ.72 కోట్ల నుంచి రూ.84 కోట్ల రాబడిని కోల్పోయింది.
ఇప్పుడు 22 హరిత హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల ఏటా మరో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర రెవెన్యూకి గ్యారంటీ లేకుండా పోతుంది. ఇంత అభద్రత మధ్య ఉద్యోగులు, ఏపీటీడీసీ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కూటమి సర్కారు వ్యాపారం చేస్తోంది.


